భారతము నందలి ప్రధాన పర్వములు 18. అవి : ఆది, సభా, ఆరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణములు. ఇందలి మొదటి యైదింటికిని 'నాది పంచక' మనియు, తఱువాతి ఐదింటికి 'యుద్ధ పంచక' మనియు, తఱువాతి మూడింటికి 'శాంతిత్రయ' మనియు, తుదినున్న యైదింటికి 'అంత్య పంచక' మనియు వ్యవహారనామములు.
వస్తువు, నాయకుఁడు, రసము
కురుపాంచాల దేశములకు రాజకీయమైన సహజ వైరము అంతరంగములో సంకురించినది. అది ద్రుపదునిచే తిరస్కృతుఁడైన ద్రోణుఁడు ద్రుపదుని పట్టి కట్టి తెండని శిష్యులను బంపుటతో రేగినది. అది తఱువాత గౌరవ పాండవులయంతఃకలహమునఁ బుట్టిన మహాసంగ్రామములో లీనమైనది. తుదకు ఇటు కౌరవులునటు పాంచాలురు నశించిరి. పంచపాండవులు మిగిలిరి. పరీక్షిత్తుతో నర్జునవంశము భూమిపై నిల్చినది. ఇది మహాభారత కథాసారము. ఈ మహాభారత కథకు అంగిరసము (ప్రధాన రసము) శాంతము. నాయకుఁడు శ్రీకృష్ణ పరమాత్మ. నాయకుఁడైన లీలామానుష విగ్రహుఁడగు నీ కృష్ణభగవానుఁడు యుద్ధభూమియుందు అర్జునుని మానవునకు ప్రతీకనుగా (Symbol) గ్రహించి దివ్యజ్ఞానోపదేశ మొనర్చినాఁడు. ఇదియే లోకోత్తరమైన మహాగ్రంథముగా ప్రాచ్యపాశ్చాత్యులచే గొనియాడఁబడుచున్న భగవద్గీత.
పాఠ సంప్రదాయములు
వ్యాసభగవానుని భారతము ప్రచారములోనికి వచ్చుటలో ననేకరీతులైన పరిణామములను బొందినది. అందుమూలముగా గ్రంథమునకు ఉత్తర దక్షిణదేశ సంప్రదాయములను రెండు విభేదములేర్పడినవి. శ్లోక సంఖ్య విషయమునను, నుపాఖ్యానముల విషయమునను నీ రెండు సంప్రదాయములకును మిక్కిలి విభేదమున్నది. మహాభారతము నాంధ్రీకరించిన కవిత్రయము వారు దక్షిణపాఠము ననుసరించిరి (శ్రీ కోరాడ రామకృష్ణయ్య).
భారతాంధ్రీకరణము : కవిత్రయము
దక్షిణ భారతదేశమున తొలుత పశ్చిమ చాళుక్యరాజుల పరిపాలనకాలము నందుకన్నడభాషలో 'పంపఁడు' గదాయుద్ధమను పేర మహాభారత కథను జెప్పినాఁడు. అది శ్రీకృష్ణ నాయకమైన వ్యాసుని భారతకథ కాదు.
612
వావిలాల సోమయాజులు సాహిత్యం-4