వారి దండయాత్రకు మూల కారణాలు. ఎప్పుడైతే మత ప్రవక్తలు వీరు చేసే దండయాత్రలకు మతవిషయికంగా ముద్రవేసి మారణకర్మలను అంగీకరించటము మొదలుపెట్టారో, ఆ నాటినుంచీ ప్రతి దండయాత్రకూ ప్రతి మారణకర్మకూ టర్కులూ, ఆఫ్ఘనులూ 'జిహాద్' (మతయుద్ధం) అని పేరు పెట్టి ప్రారంభించారు. అన్ని జాతులూ అన్ని దేశాలలోనూ అక్రమించడం ఆరంభించారు. మహమ్మదు ఘనీ చరిత్రకారుడు, ఘజనీ గురించి చరిత్రలో ఇలా రాశాడు. అతడు విగ్రహాలను ఛిన్నాభిన్నం చేశాడు. దేవాలయాలను నేలమట్టం చేసి వాటిలో ఇస్లాం మతాన్ని స్థాపించాడు. ఇంటికి తిరిగి వచ్చి ఇస్లాం పేరిట తాను జరిపిన అఖండ విజయాలను లెక్కబెట్టాడు. హిందూదేశము మీద ఎల్లప్పుడూ ఇదేరీతిగా మతయుద్ధాలు సాగిస్తానని ప్రతిన పుచ్చుకున్నాడు.
అయితే హిందూ దేశ చరిత్ర చదివిన ప్రతివారికీ ఘజనీ మహమ్మదు దండయాత్రలు దేశాన్ని కొల్లగొట్టడానికి ఉద్దేశించబడ్డవి కాని ఇస్లాం మతవ్యాపకానికి కాదని తెల్లమౌతవి. మతోద్రేకంతో ఎటువంటి యుద్ధాలకైనా సైన్యాన్ని పురికొల్పవచ్చునని అతనికి బాగా తెలుసును. కొల్లగొట్టడానికి తోడు మతోద్రేకం సాయం చేసింది. ఫలితాలు అనంతంగా చేకూరినవి. తైమూరు వంటి దండయాత్రికుడు కూడా అటువంటి ఆశయముతోనే హిందూదేశం మీదికి వచ్చినట్లుగా స్వీయచరిత్రలో ఇలా వ్రాసుకున్నాడు.
“దేవాలయాలను నాశనం చేసి ఘాజీలమూ, ముజాహిద్దులము (మత సంస్కర్తలము) కావటానికి నేను హిందూ దేశ దండయాత్రలు తలపెట్టాను.” అయితే జార్జియా తప్ప మిగిలిన అనేక ముసల్మాను రాజ్యాల మీద కూడా తైమూరు దండయాత్రలు చేశాడు. ముసల్మాను విజ్ఞానానికి అపకీర్తి తీసుకోవటానికో అన్నట్లు, 2000 మంది షేకులను సజీవంగా భూస్థాపితం చేసి వారిమీద సున్నపురాయితో కట్టడం కట్టించాడు. ఖలీఫాను తుత్తునియలు చేశాడు. బాగ్దాదునుంచి సమర్ఖండ్ దారుల్ ఖిలాఫత్ను మార్చాడు. బాహుబలంతో తాను 'ఖలీఫా'నని ప్రకటించాడు. అయినా తైమూరు ఇస్లాం మతస్థుడే. ఇదేవిధంగా ఆఫన్లు, తుర్కులు కూడాను. మహమ్మదు ప్రవక్త అనుయాయులము అని వారు చెప్పుతున్నా, వారి చేష్టలకూ ప్రవక్త చేష్టలకూ హస్తిమశకాంతరము.
ప్రవక్త ఇస్లాం మతేతరులను ఉద్దేశించి "నీవు ప్రార్థించిన విధంగా నేను ప్రార్థించను. నేను పూజించినట్లు నీవు పూజించవు. నీ మతం నీది, నా మతం నాది” అన్నాడు. అంతేకాదు, “మత విషయకంగా ఎవరినీ పీడించవద్దు. లోకంలో పుట్టిన ప్రతివాళ్ళకూ ఏదో ఒక నమ్మకం ఉంటుంది" అన్నాడు.
602
వావిలాల సోమయాజులు సాహిత్యం-4