Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతీయ సంస్కృతిలో ఇస్లాం ప్రభావము

(1206-1526)

జన్మరాహిత్యం కలిగేటంతవరకూ మానవుడు 'పునరపి జననం పునరపి మరణం' సంసార యాత్ర సాగిస్తాడనీ, అనంతసాధన మూలంగా జన్మవిమోచనం పొందుతాడనీ భారతీయుల నమ్మకం. తరణోపాయాల్ని తెలుసుకోలేకుండా తబ్బిబ్బులు పడి మానవ లోకాన్ని ఉద్ధరించడానికిగాను, ధర్మసంస్థాపనార్థమూ, పురుషోత్తముడు అవతరిస్తూ ఉంటాడు. పూర్వజన్మంలో చేసిన దానికీ, ఈ జన్మలో చేస్తున్న దానికీ జీవుడు ప్రతిఫలాన్ని పొందవలసిందే. ఇటువంటివన్నీ మన భారతీయుల శాస్త్రవాదాలు, సామాన్యుల నమ్మకాలూ. మత విషయకమైన కర్మకాండలకు, ఆచార వ్యవహారాలకూ, సంస్కృతికీ, భాషావిషయిక విజ్ఞానానికీ భారతీయులది ఒక ప్రత్యేకమార్గము. సమస్త విషయాలకూ వారికి గర్వకారణమైన స్థితి ఉండనే ఉన్నది.

ఇస్లాం అరేబియా ఎడారుల్లో పుట్టింది. ఈజిప్టు, అబిసేనియా, మొరాకో, స్పెయిన్ ఫ్రాన్సుల్లో కొంత భాగమూ వ్యాపించింది. బైజయింటైను సామ్రాజ్యంలో తన ప్రభ వెలిగించుకున్నది. ఆసియా మైనరు టర్కీ, రష్యా, చైనాలలో నివాసం చేస్తూ ఉన్నది. పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, హిందూస్థానాలను తన ప్రభావానికి లోను చేసుకున్నది. మతవిషయకంగా పరిశీలిస్తే ఇస్లాములో మార్పు లేదు. రాజకీయంగానూ, నైతికంగానూ చూస్తే మటుకు దానికి కొంత వృద్ధిక్షయాలు కనిపిస్తూనే ఉన్నవి.

ఇస్లాం ఏ దేశంలో ప్రవేశించినా ఆయా దేశాలు వాతావరణానికి అనుగుణంగా ఆచార వ్యవహారాల్లోనూ, అనుభవాలలోనూ మార్పును పొందింది.

భారతదేశాన్ని దండెత్తి జయించిన ఇస్లాం మతస్థులు టర్కులు, ఆఫ్ఘనులు. రెండు జాతులవారు ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నవారు గాని అరబీయులు కారు. అరబ్బులు కూడా మన దేశాన్ని జయించను యత్నించారు. కాని వారి పాలన 40 సంవత్సరాలకు మించలేదు.


600

వావిలాల సోమయాజులు సాహిత్యం-4