మనోవిశ్లేషణ
ఆంధ్ర కథారచయితలలో కొందరు హేతువాద దృష్టితో సైకో ఎనలిస్టులు అనే మనస్తత్వ శాస్త్రజ్ఞులైన 19వ శతాబ్ది చివర భాగంలోని ఫ్రాయిడ్, యాడ్లర్ మొదలైనవారు మానవప్రవృత్తిని గురించి చేసిన సిద్ధాంతాల ప్రభావాలకు లోనై, వారి ఆలోచనలకు ఆకర్షింపబడి ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో వాటిని అమలులోకి తేవటం కోసం రచన చేసిన ఇంగ్లండు, అమెరికా సాహిత్యకుల రచనాప్రక్రియకు లోనయినారు. ఇలా ఆంధ్ర రచయితలు ప్రభావితులు కావటం కొందరిలో 25 సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైనది. కొందరిలో 1944-50 ల కాలంలో విస్తృతంగా సాగింది. ఈ ఆంధ్ర కథకులు, మనస్తత్త్వశాస్త్రజ్ఞుల ఆత్మ, జ్ఞాతస్థితి, అజ్ఞాతస్థితి, మనోభావ వ్యక్తిత్వాలను ప్రేరేపించే శక్తి అయిన లిబిడో తల్లిదండ్రులకు, పిల్లలకు సంబంధించిన స్త్రీపురుష లైంగికప్రవృత్తికి సంబంధించినవయిన ఈడిపస్ కాంప్లెక్సు, ఎలెక్ట్రా కాంప్లెక్సు, నార్సిజమ్, ఆత్మన్యూనత్వం (Inferiority Complex) ఇత్యాది భావ సిద్ధాంతాలకు అనుగుణమైన మనోవిశ్లేషణను ప్రదర్శిస్తున్న అందరి రచనలలోని పాత్రలను పోషించి కథనశిల్ప ప్రత్యేకతను సంపాదించటం, కొందరు గాఢవిశ్వాసంతో పై మనస్తత్వ శాస్త్రం సిద్ధాంతాల లక్షణాలతో జీవితవర్తమానం సాగించటం జరిగించారు. ఈ మనస్తత్త్వ శాస్త్రవిజ్ఞానం మూలంగా, నిరూపితమయ్యే మనోవిశ్లేషణకు విశేష ప్రాముఖ్యాన్ని, ప్రచారాన్ని కల్పించే దృష్టితో నేడు సాహిత్య విమర్శనల్లో సైతం ప్రత్యేక స్థానాన్ని కల్పించటం జరుగుతున్నది. శ్రీ దీక్షితులకు ఈ రీతి మనోవిశ్లేషణతో పరిచయం ఉన్నది. కాని మానవజాతి పశుత్వ దుర్జనత్వాలను ఇవి విశేషంగా ప్రదర్శించి వెల్లడించినవి. దీనిలోని ముఖ్యాంశాల సత్యతను గురించి, సత్ప్రయోజనాన్ని గురించి వీరికి విశ్వాసం లేదు. వీరి విజ్ఞానం సంక్షేమకరము, ఉత్తమమానవత్వ, మానవ దివ్యత్వప్రదర్శనము ఆర్షజనానుభూతి నిరూపితము, సర్వతోముఖము అయిన భారతీయ విజ్ఞానము, ధార్మికమైనదీ. ప్రయోజనాలను నిత్యానుభూతితో అనుభవపూర్వకంగా పోషించటంలోను మనోవిశ్లేషణను ప్రదర్శించారు.
సమకాలిక రచయితలలో వీరికున్న విశిష్టత: చిన్న కథలు వ్రాసిన వారిలో శ్రేష్ఠులు శ్రీ చింతా దీక్షితులు. (క్రొవ్విడి లక్ష్మన్న - భారతి -మాఘ) చిన్న పిల్లలు అమాయక మనస్తత్వాన్ని, సౌకుమార్యాన్ని వీరు నివేదించినట్లుగా ఇంకెవ్వరూ నివేదించలేదనుటలో అతిశయోక్తి లేదు. శ్రీ దీక్షితులు సాహిత్యకంగ మాకు నచ్చాడు.
598
వావిలాల సోమయాజులు సాహిత్యం-4