Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంటి కొన్ని పాత్రలు సాహిత్యలోకంలో సజీవాలయినాయి. పాత్రపోషణలో ప్రజ్ఞాన్వితులైన శ్రీ దీక్షితులు ప్రతిభావంతులు.

ఇతర రచయితల సిద్ధాంతాల ప్రభావం

చిన్నకథ 1915లో ప్రారంభమై, బహువిధ కథావస్తు గుణ భేదాలతో అవిచ్ఛిన్నంగా నేటివరకు వృద్ధి పొందుతూ, ప్రస్తుత సాహిత్యయుగంలో కథాయుగం అన్న కీర్తిని ఆర్జించి ఇచ్చింది. కథాప్రారంభకుల తొలినాటివారు భారత స్వాతంత్ర్య ప్రియులు, దేశభక్తితత్పరులు అయిన బంకించందు మొదలగు వంగభాషా రచయితల సిద్ధాంతాల ప్రభావాలు 1910లో ప్రారంభమై, ఉర్దూ కథా రచయితలగు ప్రేమ చంద్ మానవత్వపు విలువలమీద కథా రచన చేశారు. వీరిలో కొందరు బాల్ జాక్, ఎమిలీజోలా, మొపాసాల వంటి రచయితలు తమ రచనలంతటా ప్రస్ఫుటీకరించిన కాముకత్వ సిద్ధాంతాల ప్రభావానికి వశమై కథారచన చేశారు. 1930 ప్రాంతంలో కొందరు కథకులు మార్క్స్ భౌతికవాద విజ్ఞానం వల్ల, మాక్సిమ్ గోర్కీ మొదలైన రష్యన్ కథకుల విప్లవ తత్త్వరచనల వల్ల, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికాభ్యుదయ కృషి, లైంగిక స్వేచ్ఛాదులతో కోరిన జీవిత ప్రియత్వాది సిద్ధాంతాల ప్రభావితులై, వస్తు విభేదాలను, కల్పించి కథారచన చేయటం ప్రారంభించారు. 1936లో భారత దేశంలోని అభ్యుదయ రచయితల సమావేశం ఉద్యమం జరిగింది మొదలు ఈ అతివాస్తవిక కథారచనల మీద, కథారచయితల మీద, రష్యన్ రచయితల ప్రభావం అధికంగా విస్తరించింది. తరువాత కొందరు రచయితలు మనస్తత్త్వశాస్త్రజ్ఞులైన ఫ్రాయిడ్ మొదలైన వారి సిద్ధాంతాల వల్ల ప్రభావితులై 'ఈడిపస్ కాంప్లెక్స్', 'నార్సిజమ్' మొదలైన వారి లైంగిక సిద్ధాంతాలను వెల్లడిచేస్తూ కథారచనలు నడిపించారు.

1915 నుంచి 45 వరకు కథారచన చేసిన శ్రీ దీక్షితులు ఈ ప్రభావాలలో దేనికీ లోనయినవాడు కాదు. ఈయన కథావస్తువులన్నీ స్వానుభవపూరిత సోపపన్నాలు. ఈయన ప్రదర్శించిన మానవత్వం, మహోన్నత గుణప్రియత్వం అనుభూతియుతాలు. ఆత్మ సంప్రదాయాను గుణాలు. శ్రీ దీక్షితులు రచనావిధానంలో కూడా పరభాషా రచయితల సిద్ధాంత ప్రభావానికి లోనయినవాడు కాదు. వీరి రచనలన్నీ స్వతంత్రాలు. వీరు పరప్రభావ రహితులు. దేశభక్తి, స్వాతంత్ర్య ప్రియత్వం, గ్రామీణ జీవిత ప్రియత్వం ఇత్యాది విశేషాలయినా దీక్షితులకు ఇతర రచయితల సిద్ధాంతాల ప్రభావం వల్ల పుట్టినవి కావు.


సాహిత్య విమర్శ

597