Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ దీక్షితులు మొదటినుంచీ కథారచనకు తేట తెనుగు వ్యావహారికభాషను వినియోగించారు. వీరి భాషలో ఆధునికులు కొందరు ఆంగ్లభాషా ప్రభావితమై వ్యవహరిస్తూ ప్రయోగించే వ్యావహారికభాష అణుమాత్రమైనా కనిపించదు. వీరి భాష వ్యావహారిక సలక్షణము, సంప్రదాయ సిద్ధము. ఇందులో జాతీయ జీవనం ప్రతిబింబించి కనిపిస్తుంది. కథలోని పాత్రల ఉనికికి అనుగుణంగా వాక్యరచన చేశారు. సముచితమైన తత్సమ దేశ్యాది అన్య దేశ్యపదజాలాన్ని స్వేచ్ఛగా భిన్న కథా కాలాన్ని బట్టి స్వీకరించారు. వీరు వ్యవహార నిర్వహణలో శిష్టులు కథా కాలాల్లో ఉపయోగించిన వ్యావహారికభాషను స్వేచ్ఛగా ఉపయోగించారు. ఉపాధ్యాయ వృత్తిరీత్యా ఆంధ్ర దేశంలోని అనేక ప్రాంతాలలో నివసించటం వల్ల వీరి కథారచనలో, ఆయా ప్రాంతాలలోని మాండలిక పదాలను ప్రీతితో స్వీకరించి ఉపయోగించారు. ఇటువంటి ఈ భాషావిన్యాసాల వల్ల వీరు ఎంతగానో ఔచిత్యశోభను సంపాదించారు. కేవలం ఆధునిక విషయాలే కథావస్తువుగా గల కథలకు వలె కాక, పురాతన, మధ్య కాల ఆధునిక పాత్రల వైవిధ్యం గల వీరు అవసరం కొద్దీ అధిక శబ్దజాలాన్ని స్వీకరించి రససౌష్ఠవోపేతంగా ప్రయోగించారు.

కథను చెప్పటంలో శ్రీ దీక్షితులు అవసరాన్ని బట్టి అనేక రీతులను అనుసరించారు. ఏ అంశమైనా కథావస్తువు కావచ్చునని సూచించడం అంశంగా 'సాహితికి కథ' అన్న కథను ప్రజ్ఞాప్రదర్శమైన విచిత్రరీతిలో వ్రాసారు. మాంటెస్సోరీ విద్యావిధానం మీద వ్యంగ్యంగా వ్యతిరేకతను వెల్లడిస్తూ 'పాఠం' అన్న కథను వ్రాసి, ప్రభుత్వం వల్ల ప్రమాదం కలుగుతుందేమో అనీ, వ్యంగ్యధోరణిలో మారుతి అన్న మారు పేరుతో చెప్పి ప్రకటించారు. తాము సేకరించిన కొన్ని జానపద సాహిత్య విశేషాలను, నీతి బోధకులైన వేమన, గువ్వల చెన్నడు మొదలైన కవివర్యుల పద్యాలను, ప్రసిద్ధ ప్రాచీనాంధ్రుల మీద చాటువులను మొదలైన వాటి ప్రయోజనాల్ని ఆశించి, కథా కథనంలో పాత్రల ముఖాన ప్రయోగించారు. కథకు మూలభావమైన అంశాన్ని గురించి విజ్ఞానాన్ని విశదీకరించ తలచి వ్యాఖ్యానించ తలచినపుడు, కొందరు కథకుల వలె తానే చెప్పక సందర్భోచితంగా అన్యపాత్రలను సన్నివేశాలను, ఉద్దేశాలను నిర్వహించు కొంటారు. ఈ పద్ధతికి దీక్షితులు వ్యతిరేకం. బాలలకు జాతీయము, దేశీయము అయిన ఉత్తమ నీతిని బోధించటం, యువకులకు సాంప్రదాయిక విజ్ఞానాన్ని, సమాచార మార్గాన్ని, దేశస్వాతంత్ర్య భక్త్యాదులను ఉత్తమ ధార్మికజీవితాతిశయాన్ని అధికంగా అత్యుత్తమ సఖ్య, ప్రణయ, దాంపత్యస్వరూపాన్ని, ఇత్యాదులను కథారీతుల మూలంగా వెల్లడించటం శ్రీ దీక్షితుల విశిష్టత.


సాహిత్య విమర్శ

595