Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోట కట్టుకొనేటపుడు వీర గ్రామీణుడు నరబలికి ప్రాణమర్పించటం, అతని శిలాప్రతిమను చూసి తృప్తితో భార్య సహగమనం చేయటం అన్నవి ఆధునికులలో కొందరు ఇలా జరుగుతాయా అని అనుమానించే అంశాలు. సత్యాలేనని ఎన్నో నిదర్శనాలు కనిపించటం, దేశంలో అట్లాంటి దంపతులిరువురి శిలాప్రతిమలు గోచరించటం సత్యాలు. బాల కథల్లో 'ఎన్నో చేస్తాను, నేను పెద్దవాడనైనాక' మొదలైన కథల్లోని బాలకుల భావాల్లోను, ప్రవర్తనలోను ఎక్కడా అతిశయోక్తి కనిపించదు. 'సూరి-సీతి-వెంకి' కథలలో ఆ బాలికల భావాలు చేష్టలు అతిసహజాలు. అసహాయోద్యమ కాలంలో విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ దేశభక్తి ప్రపూరితలైన తల్లులు మహాత్మాగాంధీ కీ జై అన్న కేకలతో ఉద్యమాలను నడుపుతున్నపుడు, ప్రభుత్వం ఆ తల్లులతో పాటు సూరి సీత వెంకి వంటి వయస్సు గల పిల్లలను సైతం జైలులో పెట్టటం, ప్రజల పరిహాసానికి లొంగి పిల్లల్ని విడిచిపెట్టటం, ఎంతో సహజంగా జరిగాయి. శ్రీ దీక్షితులు సూరి సీత వెంకిల జైలు శిక్షకు విముక్తిని కల్పించటంలో అసహజత అణుమాత్రం కనిపించదు. ఇలాగే 'వటీరావు కథల'లోని అంశాలు సైతం సహజ కల్పితాలైనాయని చెప్పటంలో వ్యతిరేకత అణుమాత్రం లేదు. వీరి కల్పనలో అంగవైకల్యం సైతం ఎక్కడా లేదు.

శిల్పం భాషా విన్యాసం, కథన రీతులు: బహువిధ ప్రయోజనాలను ఉద్దేశిస్తూ కథ, కథానకము, అఖ్యానము, ఆఖ్యాయిక అన్న భారతీయ కథావిధానాలకు ఇంగ్లీషులో స్టోరీ, టేల్, స్కెచ్ (షార్ట్ స్టోరీ) అనే కథావిభాగాలకు ఇంచుమించుగా సరిపోయేలాగున కథలు వ్రాసిన దీక్షితులు, ఆయా కథలకు యోగ్యమైన శిల్పాన్ని పాటించి విజయవంతమైన కథారచన చేశారు. కథాబీజాలను ప్రథమంలోనే నిపుణులతో నిర్ధారణ చేసుకొని, చింతా దీక్షితులు చిత్తాకర్షణ చేసే కథోదయాన్ని కల్పించి, అందులో కావ్యార్థ సూచనను గర్భీభూతం చేసి, తర్వాత కథాంతర్భాగ కల్పనా విన్యాసాలతో నడిపి జాగరూకతతో రసవంతంగా కథను గమ్యస్థానం చేర్చటం. పరితకు భావోద్రేకాన్ని కలిగించే సందర్భ సహిత భావాన్ని చిన్న కథలలో సాధారణంగా ఒక్కటే ప్రధాన పాత్రని చేయడం, తక్కిన పాత్రలను వాటికి అణగి ఉండేటట్లు చేయటం, రసోచిత నేషభాషాచేష్టలతో పాత్రలను పోషించటం, మెరుపు వంటి చిన్న చిన్న కేంద్రాల్ని కల్పించుకోవటం దేన్ని ఎక్కువ స్పుటంగా చిత్రించాలో దాన్ని చిత్రించటం, గమిత వేగాన్ని కల్పించి కథనాన్ని నడపటం, మొదలైన కథాశిల్ప స్థూల స్వరూప చమత్కార లక్షణాలను వహించటం, ఇత్యాది నాటక శిల్పలక్షణాలన్నిటిలో దీక్షితులు సిద్ధహస్తులనే చెప్పవచ్చు.


594

వావిలాల సోమయాజులు సాహిత్యం-4