Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ దీక్షితులు 'ఎన్నో చేస్తాను, ఇతర కథలు' అన్న బాల కథాసంపుటిలోని (బాలానంద ప్రచురణ ప్రథమ ముద్రణ 1955 దేశీ ప్రెస్, విజయవాడ-2) ఆరు కథలలో 'సాహితికి, కథ, పాఠము, ఎన్నో చేస్తాను, మా అబ్బాయి' అన్న నాలుగు కథలు 'ఏకాదశి'లో ముద్రితాలయినాయి. నేను 'పెద్దవాడనైనాక' 'నీతి పాఠము' మిగిలిన రెండు కథలు.

"... అది ఎక్కి ఆకాశం దగ్గరదాకా వెళ్ళుతాను. వెళ్ళి ఆకాశాన్ని ముట్టుకొంటూ నిచ్చెన చివర నిలబడి నక్షత్రాలని కోస్తాను. కోసి జేబులో వేసుకొని ఆడుకుంటాను.” ఇత్యాదిగా బాలుడి హృదయ భావాలను వెల్లడించటం 'నేను పెద్దవాడనైనాక' లో కథావస్తువు. పిల్లలకు గణితశాస్త్ర, ఖగోళశాస్త్ర, భూగోళశాస్త్రాదులు చెప్పటం కంటె నీతిని బోధించటం ప్రయోజనకారి అని తలపోసే తండ్రి మనోభావాలను వెల్లడిస్తుండగా వచ్చిన పిల్లవాడికి, దేవతా సంబంధమైన నీతిని మీరిద్దరూ పెద్ద దేవుళ్ళయితే నేను చిన్నదేవుడినే అని బాలుడు ఊహను పొంది, తన నీతిబోధకు ప్రయోజనం తీరుతుందని భావించే 'నీతి పాఠము' కథావస్తువు.

'సూరి - సీత - వెంకి' చింతా దీక్షితుల మరొక బాల కథాసంపుటి. (ప్రథమ ముద్రణ 1955, త్రివేణి పబ్లిషర్స్ మచిలీపట్టణం) పేరంటం, తీర్థం, పొడుపు కథలు, బొమ్మరిల్లు, భట్రాజు, సంకురాత్రి, జైలు ప్రవేశం, గుజ్జన గూడు, వెధవ ఉత్తరం, అమ్మ నన్నెందుకు కొట్టాలి? సూపర్నెంటు కూతురు, ఎవరు మంచివారు? అన్నవి ఇందులో కథలు. ఎనిమిదేళ్ళ సూరి, ఆరేళ్ళ సీత, మూడేళ్ళ వెంకి అక్కాచెల్లెళ్ళు. మరొక అమ్మాయి ఇంటికి పేరంటానికి వెళ్ళటం, సీత ఎక్కువగాను, మిగిలిన అక్కాచెల్లెళ్ళు తక్కువగాను ముద్దులమారి అల్లరి చేయటం, చివరకు సూరి తెచ్చుకున్న శనగలు వేయించి తెచ్చి అందరికీ పెట్టి సంతోష పెట్టటం, 'పేరంటం'లో కథావస్తువు. సాగరామావాస్యకు సూరి, సీత, వెంకి తల్లి, తండ్రి సోదరులతో తీర్థానికి వెళ్ళటం, అక్కడ సూరి, సీత, వెంకిలకు చుట్టమైన దొడ్డమ్మతో పరిచయం కలగటం, ఆమె తన ఇంటికి తీసుకొని పోవటం, తిరునాళ్ళలో బొమ్మలు కొనుక్కోటం, తండ్రితో స్నేహితుడు కనబడి ఇంటికి పిలిస్తే వీళ్ళకు ఒకచోటు చెప్పి ఉండమని, ఆయన వెళ్ళిన తర్వాత ఏడుస్తుంటే మరొకరు వీళ్ళను ప్రేమతో తమ ఇంటికి తీసుకొనిపోవటం, అది తెల్సుకొని తండ్రి ఆ ఇంటికి వెళ్ళి సూరి, సీత, వెంకిని తెచ్చుకోవటం 'తీర్థం' కథావస్తువు. తీసిన కొద్దీ పెరిగేదేమిటి? - నుయ్యి, గొయ్యి. ఇట్లాంటి పొడుపు కథలతో సూరి, సీత, వెంకిల తెలివి బయటపెట్టడం 'పొడుపు కథలు' కథావస్తువు.


సాహిత్య విమర్శ

589