Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'మన్మథ సందర్శనం'లో మదరాసులో నివసించే రచయిత మన్మథుడు, రతీదేవి, వాయుదేవుల గురించి తెలియజేయటం, మన్మథప్రభావం ఎవరి మీద ఉండేది, ఉండేవాళ్ళ లక్షణాలు, ఉండని వాళ్ళ స్థితిగతులు వివరించటం మన్మథ సందర్శనము కథావస్తువు. తండ్రి మరణానంతరం కొంత కాలానికి యుక్తవయస్కుడైన నారాయణ అనే యువకుడు ఇంటి కాగితాలు తిరగవేస్తుంటే ఒక కాగితం మీద 'నిధికి దారి' అని కనిపించి తరువాతి భాష అర్థం కాకపోవటం, తెలుసుకోవటం కోసం ఆప్తమిత్రుడు విశ్వనాథుడి దగ్గరకి వెళ్ళటం, నారాయణ అంతకు పూర్వం రంగయ్య అనే అతని కుమార్తెను మరొకరు వివాహం చేసుకోవటాన్ని అడ్డుపడితే కష్టపడుతున్న రంగయ్యకు నిధికి దారి విషయం ముందే తెలుసునని, ఆయన కుమార్తెను పెళ్ళి చేసుకుంటే విషయమంతా తెలియచేయిస్తానని అబద్దం చెప్పి మోసగించి, విశ్వనాథుడు రంగయ్య చేత నారాయణకు పిల్లనిప్పించి పెళ్ళి చేయించి మిత్రుణ్ణి బయట పడేయటం, ‘గాలిపాటు' కథావస్తువు.

దంపతులైన ఈరమ్మ, అంగడు అనే అన్యోన్యప్రేమికులు, ఆటవికులు. తేనె తెట్లు కొట్టి తేనె త్రాగుతూ గడ్డలు, చిన్న జంతువులు తింటూ సుఖిస్తుండటం, ఒక సమయంలో, ఈరమ్మ భర్త అంగడు కొట్టలేని తేనె పట్టును మరొక కొట్టగలిగిన వాడితో వెళ్ళిపోయి, వాడు కొట్టిన పట్టులోని తేనె త్రాగి వాడితో సుఖంగా జీవిస్తూ ఉంటుంది. ఈరమ్మ అతన్ని ప్రేమిస్తూ పట్టు కొట్టే ప్రజ్ఞ నేర్చుకుంటుంది. భర్త అంగడు చూసి బాధపడి మరణించటం, ఈరమ్మ అంగడి మృతి చూసి సత్యాన్ని గమనించి తన దోషాన్ని అర్థం చేసుకొని, తాను కూడా మరణించి సహగమనం చేయటం 'చెంచు దంపతులు' కథావస్తువు.

గ్రామాలను దోచుకుంటూ క్రూరకర్మలతో భయపెట్టుతున్న బందిపోటు దొంగను రాజు ఎంత ప్రయత్నించినా లొంగదీయకపోవటం వల్ల, గ్రామాలలో పెద్దలు సభచేసి కష్టాలు తీర్చుకోవటం కోసం అతన్నే రాజువు కమ్మని రాయబారాలు నడిపి, అతడి అంగీకారం పొంది కోట కట్టడానికి నిర్ణయించుకొని, రాజ్యప్రారంభానికి నరబలి అవసరం కాబట్టి అర్థిస్తే ఒక సాహసిక ధర్మవీరుడు ప్రాణాలు అర్పించినందుకు, రాఘవరాజు అనే బందిపోటు ఆ వీరుడికి సత్కీర్తిని కల్పించటం కోసం శిలాప్రతిమను చేయించి ప్రతిష్ఠ చేయగానే సంతృప్తితో చూసి అతడి భార్య సహగమనం చేయటం - సాహిత్య అకాడమీ పక్షాన ముద్రితమైన ఆంధ్ర కథామంజూష అన్న కథాసంపుటిలోని శ్రీ దీక్షితుల 'శిలాప్రతిమ' కథావస్తువు.


588

వావిలాల సోమయాజులు సాహిత్యం-4