Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకటిగా కనుపించడం విశేషం. ఆశ్రమ జీవితం; రమణ మహర్షి పరిచయం స్థిరమైన తర్వాత కొంత కాలానికి 1948 ప్రాంతంలో దీక్షితులు ప్రియమిత్రుడు గుడిపాటి వెంకట చలానికి ఆ మహావ్యక్తితో పరిచయం చేయటం, వారు రమణ భక్తులై 1959 వరకు తుది జీవితాన్ని రమణాశ్రమంలో గడపటం జరిగాయి. ఆశ్రమపాలన విషయంలో దీక్షితులకు కొంత అధికార ముంటుండేది. 14-4-1950లో రమణ మహర్షి నిర్యాణం చెందినపుడు, దీక్షితులు కొన్ని దినాలు అరుణాచలంలో ఉండటం కూడా జరిగింది.

1951 నుంచి ప్రారంభమైన వ్యాధితో అనారోగ్యం వల్ల బాధపడుతూ జీవించారు. దీక్షితులు సజ్జనుడు, సరసహృదయుడు, ధర్మాభిమాని, ఉత్తమ నీతివర్తనుడు, అవసర సమయాల్లో అతి సాహసికుడు, సుకుమార హాస్యప్రియుడు, మిత్రులకు అత్యంత ప్రియమిత్రుడు. చలం మిత్రుడు ఒకడు 1954లో “దీక్షితులుగారు చచ్చిపోయినారా?” అని చలంగారిని ప్రశ్నిస్తే ఆయన అరుణాచలం నుంచి ఉత్తరం వ్రాసి, దీక్షితుల క్షేమం తెలుసుకొని "మీరు చచ్చిపోయినారంటే ఆ రోజుల్లో మేమందరం తిండి సరిగా తినలేదు” అని “భగవాన్ అనుగ్రహం మీపై పూర్తిగా వుంది. మీరు నిరాశపడకండి. మీకు గొప్ప భవిష్యత్ ఉంది" అని ప్రేమలేఖ వ్రాయటం జరిగింది.

చింతా దీక్షితులు పొడగరి. ఎందరున్న గుంపులో అయినా ముందు ఆయన కనిపిస్తారు. వర్చస్వి, పచ్చనిఛాయ. కుదురుగా కోలగా చురుగ్గా ఉండే ముఖం. ఇతరులందరూ ఆయన భుజాల దగ్గరికి కూడా రాలేరు. ఆయనను పోల్చుకోవటంలో ఏ శ్రమా ఉండేది కాదు. తలపాగా, కోటు పంచెతో ఉద్యోగవేషంలో, ఉత్తమ సత్త్వగుణ స్వరూపప్రవర్తనుడుగా దేశంలో ఆయన ఎక్కువ పరిచితుడయినాడు. ఒంటిచేత్తో రాజమహేంద్రవరం గోదావరిని అవతలి ఒడ్డువరకు ఈదగలవాడు. భారతదేశ బానిసత్వం నశించాలన్న అభిలాష గల దేశభక్తిప్రపూరితుడు. జాతీయాభిమాని. ఆంధ్రరాష్ట్రాభ్యుదయాభిలాషి. తన పేరు దీక్షితులు అని ఉచ్చరించేవాడు కాడు. అప్పయ్య దీక్షితులవారిని "అప్పయ్యవారు" అనీ, శివశంకరస్వామి ఆయనకు అంకితమిచ్చిన "దీక్షిత దుహిత"ను బట్టి "దుహిత” అనీ అనటం నేను స్వయంగా విన్నాను.

సత్కారాలన్నా, సన్మానాలన్నా దీక్షితులు దూరదూరంగా తొలగిపోతుండేవారు. అందువల్ల ఘనంగా గౌరవించాలని అభిలషించిన తెనాలివారు, అతిరహస్యంగా ప్రయత్నాలు చేసి బలవంతం చేస్తేగాని ఈయన అంగీకరించలేదు. ఈయన బుద్ధి ఎన్నడూ తోడి సాహితీపరుల వ్యక్తిగతదోషాలమీద గాని, రచనాదోషాలమీద గాని మళ్ళేది గాదు.


సాహిత్య విమర్శ

579