Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని చెబుతూ, చావు తప్పదని ఎరిగినప్పుడు ఉన్నంత వరకూ అనుభవిద్దామని ఉమర్ ఖయ్యాము మతాన్ని సూచించలేదు. జీవితానికి తరణోపాయాలు సత్యము, ధర్మము, పావిత్ర్యము నని ఆయన ప్రబోధము.

'జన్మంతా ఒక పవిత్ర యజ్ఞం
చావందులొ పూర్ణాహుతి'

అని ఆయన నిశ్చితము. పూర్ణాహుతికి ఫలితము తప్పక రాబొయ్యే జన్మలోనైనా వచ్చితీరుతుంది. అంటే మృత్యువు రాబొయ్యే జన్మసంస్కారానికి సహాయకారి అన్నమాట. బ్రౌనింగు మహాకవి కూడా 'మృత్యువు జ్ఞానకక్ష్యాంతరాలలో దీపికను చూపించే దాసి' (Death is a groom that brings taper into the outer world) అని చెప్పాడు. నోరి జీవితంలో నిరుత్సాహం ఎరుగనివాడు. ఎన్నటికినీ లేనివాడు, రానివాడు. ఇంకో కావ్యంలో

"పసివేళటి పాలనునుపు
ఎలబ్రాయపు ఏటిపొంగు
ఇంకి పో లేదీ
ఎదలో సుస్థిరముగ
పదిలమైనా యోయ్!"

అని తన నిత్యనూతనత్వాన్ని గురించి వ్రాసుకున్నాడు. నోరి కర్మకాండతో పాటు భక్తి భావాన్ని కూడా తనలో పెంపొందించుకున్నాడు. 'జగదేకమాత, సర్వజ్ఞస్వామి' ఇద్దరే ఆయన కారాధ్యదేవతలు. వారి రూపాలనే వివిధదేవతలలో కవి చూస్తాడు. 'వేంకటేశార్పణము' అనే కావ్యంలో దీనంగా స్వామితో తన అజ్ఞానాన్ని, మోహాంధతను చెప్పుకొని, ఆయన వాత్సల్యము అపారమని, అజ్ఞేయము, అచింత్యము నని పొగడినాడు.

శా. 'నీ సేవార్థము నీ ప్రతిష్ఠ సలుషన్ నిర్మించుకొన్నావు నీ
ప్రాసాదంబుగ ఈ శరీరమని నే భావింపగా లేక పే
రాసన్నాదని యెంచి ఆత్మసుఖమే యాశించి యత్నించి ఆ
యాసం బందితి దాన దేహ మపవిత్రాత్మంబు గావించితిన్.'

అని తన తప్పిదాన్ని దాచిపెట్టకుండా భగవంతునితో వెళ్ళగక్కాడు. భగవత్సాన్నిధ్యములో ఒకప్పుడు సన్న్యస్తభావము కూడా ఆయనలో ప్రకోపించింది


సాహిత్య విమర్శ

573