ఈ ప్రేమగీతాలన్నిటిలోనూ ఒక మూలసూత్రమున్నట్లు కనిపిస్తుంది. భక్తిరసములోని పంచభావాలలో మధుర భావము ఉత్తమోత్తమము. కవి హృదయంలో ఆ భక్తి రససంబంధమైన మధురభావన నిలచి, దాని సుస్పష్టరూపాన్ని ప్రతి గీతములోనూ ఒలకబోసుకుంటున్నది. మైత్రి విషయంలో కవి వ్యక్తిలోని ఉత్తమగుణాన్ని గ్రహిస్తాడు. లోకమేమనుకున్నా ఆయనకు లెక్కలేదు.
ఆ.వె. 'నీచ కఠిన క్రూర నింద్య కర్ముడవైన
ఇంక నేమియైన నేమి, నేడు?
ఒక్కవేళ నీదు నుత్తమోదాత్తాత్మ
నెరిగియున్న నేను మరువ దాని' -
అని నింద్యవర్తనుడైన మిత్రునితో గూడ స్నేహం చేస్తాడు. 'మిత్రుని స్ఫురణ' అనే కావ్యంలో -
'కాల మేఘచ్చన్న తమస క
రాలమైన యమాస నిశకున్
దినీప్రభ బోలు దృష్టికి
నీదు దర్శనము' -
అని ఉప్పొంగి పోతాడు. స్నేహితుడు కోపగించి ఏమన్నాగాని సహించటానికి సంసిద్ధపడతాడు గాని వెనుతిరగడు. అతని అర్ద్రతకు అవతలివాళ్ళే కరిగిపోతారు. 'వీర పరిష్వంగం'లో -
తే.గీ. 'జలజలని మోదబాష్పముల్ జాలువార
నిశ్చలకరమ్ముతోడ ఈ నిశిత ఖడ్గ
మిచ్చుచున్నాడ నిదె వధియింపు నన్ను
నెచ్చెలీ! క్రోధమింక పోనేరదేని!'
అని ధీరుడై నిలిచినప్పుడు స్నేహితుడు లొంగిపోతే
తే.గీ. 'పులకిత మదీయగాత్ర ముప్పొంగె, నకట,
భాసురాయుధ మటు పారవేసె దేల?
ఏల భరముగ నను కౌగిలించె దోయి!'
570
వావిలాల సోమయాజులు సాహిత్యం-4