Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధురమైన లజ్జను త్యజించి నాయకునికి సంతుష్టి కూర్చటానికి ఎంత ప్రయత్నించినా నాయకుని మనస్సు ఆమె మీదికి ప్రసరించలేదు. అప్పుడు గర్వార్పణములో నాయిక

తే.గీ. 'గాఢ చిరసంగతిని మమైక్యంబు గన్న విపుల గర్వము కూడ నర్పింపవలెనె, హృదయ వేదన కన్నీరు వదలవలెనె, ప్రేమ కఠినాంతరంగ, నా హృదయనాథ!' అని నాయకుని దూరుతుంది. కాని ఆమె హృదయంలోనుంచి అతనికి ఉద్వాసన చెప్పలేక 'నా హృదయనాథ' అని సంబోధించి చల్లబడిపోతుంది. 'రాగభయం'లో నాయిక చిత్రమైనది. నాయకుడు ఆమె యెదుట నిలువబడినంత మాత్రాన్నే ఆమె ఎద దడదడ మంటుంది. మనసు భయవిహ్వలతతో మైకం క్రమ్మిపోతుంది. అతడు నాలుక కదిల్చితే ఆమె నాలుక తడియారి గొంతులోని స్వరము కుంచించుకొని పోతుంది. అతను కౌగిలిలో చేరిస్తే సివమెత్తి అరుస్తుంది. నాయకుని ఉన్నతికి తగిన దానిని కానేమోనని ఆమె భయము. నాయకుని సుఖానికే తన సర్వస్వాన్ని అర్పించి అతని ఆనందంలోనే తన జన్మకు సాఫల్య మున్నదని భావించుకుంటుంది. 'జన్మ సాఫల్య' నాయిక. 'రాక్షస ప్రేమలో నాయిక ప్రమాదకరమైనది.

'నన్ను ప్రేమిస్తివా నా హృదయ మమృతమ్ము
కాదేని నాయెడద కఠినవజ్రమ్ము!
నన్ను మమతం గన్న నాయాత్మ నీదాసి
మీరుచో నీపాలి మృత్యు దేవతను.'

అని నాయకుని బెదరించి ఆత్మసుఖాన్ని చూచుకుంటుంది. 'నూతన క్రీడ' లోని నాయిక ప్రియుని అభిమతాన్ని అనుసరించేది. అందులో కలిగే తన బాధను కూడా లెక్కచెయ్యదు.

'పెదవి కదపక, నవ్వక ప్రీతి గదుర
అరయ కిటువైపు పుల్లనేత్రాంబుజముల
ఇప్పుడు నీవాడు లీల బాధించె నన్ను
ఇదియె ప్రియమైన నటులె కానిమ్ము నాథ!'

అని చెప్పుకుంటుంది. విరహతాపాన్ని బిగ్గబట్టి ఉన్న నాయికను నాయకుడు వచ్చి లాలిస్తాడు. 'కంఠ సంశ్లేషణము' శిథిలము కాగానే


568

వావిలాల సోమయాజులు సాహిత్యం-4