శా. 'నిన్నా మొన్నటిదాక ఎండలను ఎంతే జాలిగా జాలుగా
నున్నా నోపిక లేక నాకువలెనే ఒక్కుమ్మడిన్ నేడు సం
పన్నాత్మీయమహాప్రవాహమున సివ్వాలాడుచున్నావు, నే
ని న్నీ నాడును పోలి పొంగగల నంటే తల్లి! కృష్ణాపగా!'
శా. 'నీ కూలంకషవాః ప్రపూరమున నెన్నే బిందువుల్ గల్గునో
నీ కన్నేళ్ళ వయస్సు లేదటనె వీనిం జూడు షట్రింశకున్
నాకల్ కట్టుచు పొంగి పొంగి మరలన్ వర్షంబు వర్షంబునన్
నీ కౌమారము చాటెదే, ఇతడు క్షీణించెంగదే అప్పుడే.’
అని ఆమెను తనకు కౌమారాన్ని తిరిగీ ప్రసాదింప వలసిందని ప్రార్థించాడు.
పుష్పబాణ విలాసము, అమరుక శతకము, శృంగార శతకము, అలంకార గ్రంథాలలో నాయకులకు సంబంధించిన శ్లోకాలు చదవగా, అవి నోరి హృదయాన్ని ఆకర్షించాయి. వాటి అస్పష్టప్రభావం మనస్సులో ఉండిపోయి అంతస్సులో కలిగిన ప్రణయభావాలు నాయికాభావంలోకి మారి, ప్రథమరాగము, రాగభయము, జన్మసాఫల్యము, గర్వార్పణము, రాక్షసప్రేమ, నూతనక్రీడ, పరాజయము, అజ్ఞాత బంధము, విభ్రాంతి, ఘాతుకప్రియ సమాగమము ఇత్యాది కావ్యాలుగా పరిణమించాయి.
'ప్రథమరాగం'లో నాయిక అబల, సుకుమార. ఇతఃపూర్వము ప్రేమబాధ ఎరుగనిది. ఆమె హృదయంలో రాగచింత కలిగించాడు గాని, నాయకుడు తాపాన ఆమె మనస్సు కలవర పెట్టాడు. అప్పుడామె నాయకునితో -
తే. 'రాజిత విచిత్రచిత్ర నిర్మాణకుశల
హిమసుధాస్వచ్ఛమగు నస్మదీయహృదయ
కైరవదళంబులం దీవు కరుణ మాలి
రాగరేఖల గాఢత వ్రాయుటేల?'
తే. భావి సుఖలబ్ధి కిట్టులు బాధపడుట
అబల సుకుమార నాకు సాధ్యంబె చెపుమ'
అని దీనాతిదీనంగా తన అవస్థను వెల్లడిస్తుంది.
సాహిత్య విమర్శ
567