Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకృతిని దర్శించి పసిపిల్లలు ఆనందించినట్లుగా ఆనందించి, ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తారు. ప్రకృతిలోని పదార్థజాలాన్ని కొందరు కవులు ఇంద్రియ సంబంధమైన వ్యామోహాన్ని పొంది ఆమె బాహ్య సౌందర్యాన్ని అభినందిస్తారు. వస్తువు కనుగుణమైన ప్రకృతి స్థితిని తీసుకొని నేపథ్య చిత్రణము చేస్తారు కొంతమంది. ఉపమా రూపకాలంకారాలకు ఉపయోగించుకొని అంతతో ఆమెకు స్వస్తి చెబుతారు కొంతమంది. ప్రకృతిలోని అతీంద్రియమైన శక్తిని గ్రహించి జగదేకమాతగా పూజిస్తారు కొంతమంది. ఆమె చిత్రరూపాన్ని సర్వే సర్వత్రా దర్శిస్తారు. వాత్సల్యభావంతో మహాశక్తికి పాదాక్రాంతులై ఆమె అపాంగావలోకనాన్ని ఆకాంక్షిస్తారు.

నోరి మొదట ప్రకృతిని ఒక జవ్వనిగా దర్శిస్తాడు. 'పూర్ణచంద్రుడు ఆమె ముఖము, సాంద్రచంద్రిక హాసము. లసితజలధరులు చూర్ణకుంతలాలు, కాలగగనము సుందర కైశికము. దినమణి చారు విస్తారమైన ఆమె కేశపాశంలో సహస్ర కాంతులతో ప్రకాశించే దివ్యమణి. 'కృష్ణవేణి' - ప్రకృతి రమణీయ హరిత వస్త్రంబు గట్టి మంజు మంజీర మధుర నిస్వనముతోడ ప్రియుని దర్శించుమతి త్రపామంథరముగ, పోతూ ఉన్న ఒక ముగ్ధ మాదిరిగా కనపడ్డది.

ఇంకో తడవ -

'ప్రకృతి కాంత వసంతదర్శనము కలుగ
బ్రియుని సంప్రీతితో నాదరించుకొఱకు
చిగురుచీరె ధరించి విచ్చేసె నెదురు'

అని వాసకసజ్జిక మాదిరిగా కనపడ్డది. అంటే ఆ నాటికి కవి ప్రకృతిలోని కేవల బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూడగలిగాడన్న మాట. తరువాత 'మై మరపు' వ్రాసేనాటికి ఆమె తల్లిగా కనిపించింది. అప్పటికి కవి ప్రకృతిమాత ముందు తన శక్తి తానెరుంగని బాల్యావస్థలో ఉన్నట్లుగా కనబడుతాడు -

'ఇపుడు నేనున్న చోటి వస్తువులు నెల్ల
జిన్ని నీ యూర్మికరముల నెత్తిపట్టి
లీన మొనరించి నీలోన నీవు పోవు
చోటులను జూపి అందందు త్రిప్పుచుందు
అట్లు ననుగూడఁ ద్రిప్పి ముదంబు గూర్చు'


564

వావిలాల సోమయాజులు సాహిత్యం-4