Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిందెలెన్నియొ నాశంబు నొందిగాని
పూర్ణ ఫల మొండు నిలువగా బోదు లతను'

అని కొత్తగొంతుకతో పాడాడు.

ఆ రోజుల్లో ఉన్న కవిమిత్రులు నలుగురూ తరచుగా కలవటమూ, ఎవరన్నా కొత్త కావ్యం వ్రాస్తే అందరూ వినటమూ, తోచిన మార్పులు సూచించటమూ అంతా ఎంతో కులాసాగా జరిగిపోయేది. శ్రీ శివశంకరశాస్త్రి సూచనలు పంక్తులు మార్చడముతోనూ, మాటలు తీసి మాటలు పెట్టడముతోనూ ఆగేది కాదు. కళావిషయంలో పొంకం (Artistic Unity) లేనిది నిర్దయతో తీసివేయమని ఆయన సలహా ఇచ్చేవాడట. దానితో వారి వారి కావ్యాలకు కూర్పులో ఒక బింకము (Finish) వచ్చేది. 'ఆయన సహాయం వల్ల స్వయంకృషి చేస్తే ఎన్నాళ్ళో తంటాలు పడితేనే గాని సాధ్యం కాకపోయే కళాభిరుచి అబ్బిం' దనీ, 'ఆయనతో పరిచయము కాక ముందుండే అతి ధోరణి (Exuberance) కొంత తగ్గిందనీ నోరి అంటుంటాడు. ఆయనతో పరిచయానికి పూర్వం నోరి దృష్టి ప్రహసననాలమీదికి విస్తారంగా ప్రసరించేది. ఆ స్వభావం క్రమేపీ కవిత్వంలో చచ్చిపోయి మాటలో మాత్రం మిగిలింది.

సాహిత్యంలో విప్లవం రావటానికి అప్పుడప్పుడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయప్రోలు 'కావ్యావళి' ప్రచురించి

ఉ. "కొమ్మలమీది కోయిలలు కుత్తుకలెత్తి స్వతంత్రభావ సూ
త్రమ్ముల కట్టసాగి మమతన్ ప్రణయాంబర చిత్రశాలలున్
కమ్మని జీవితానుభవ గాథలు స్వాదుకథాపదేశ మా
ర్గమ్ములు కర్ణరంజకముగా వికసించెడు నేడు భారతీ!"

అప్పటికే ఉచ్చకంఠంతో వినిపిస్తున్నాడు. అబ్బూరి, బసవరాజు నవ్య సాహిత్య క్షేత్రములో నూతనపంథాలను తొక్కిన కవితాకర్షకులు.

ఇంతలో 'సాహితీ సమితి' పుట్టింది. ప్రాచీన సాహిత్య మార్గంలో నడుస్తున్నామని చెప్పుకుంటూ, సాముగరిడీలు చేసే అవధాన కవులమీద, వారి కవితాపద్ధతులమీద తిరుగుబాటు చేసి, నూతన వ్యక్తిత్వాన్ని తెలుగు సాహిత్యానికి కట్టిపెట్టాలనే ఉత్సాహంతో ఉన్న కవిమిత్రులు సభ్యులుగా చేరారు. వీరందరిలో ఒక కట్టుబాటు ఉండేది.


సాహిత్య విమర్శ

561