నోరి ఖండ కావ్యాలు
"చిన్నతనంలో భారతము, భాగవతం, రామాయణమూ వ్రాసినవారు చాలా గొప్ప కవులనీ వారు వ్రాసినట్లుగానే చిరస్థాయిగా ఉండే కావ్యం (తాను) కూడా ఒకటి వ్రాయవలెననీ" నోరిలో ఒక అభిప్రాయం పడిపోయింది. అప్పటికా గ్రంథాలు చదవనుకూడా లేదు. ఆ చిన్ననాటి ఆశయాన్ని నెరవేర్చుకోటానికి, చిన్నతనం నుంచే పద్యరచన ప్రారంభించాడు. అందుకు వారి నాన్నగారు చాలా సహాయం చేశారు. కుమారుడికి వ్యాకరణం నూరిపొయ్యాలని ఆయన ప్రయత్నం. ఆయన బలవంతం వల్లనే నోరి సంస్కృతము అభ్యసించ ప్రారంభించాడు. ఆయన సంస్కృతాంధ్ర పండితులు, చిన్నతనములో పాదుకాంత దీక్ష పుచ్చుకున్నారట. పెద్దతనములో సంధ్యావందనము కూడా శ్రద్దగా చేసేవారు కాదు. భోజనమునందు నోట్లో ఉదకము మాత్రము ప్రాశన చేసేవారు. మిషనరీలకు, డాక్టర్లకూ ట్యూషనులు చెప్పటం వల్ల సయన్సులమీద ప్రమాణబుద్ధి కలిగింది. అయినా పూర్వాచార పరాయణత ఉండకపోలేదు. పినతండ్రి గురులింగశాస్త్రిగారు గొప్ప విద్వాంసులు. సాహిత్యములో నిధి, జ్యోతిష శాస్త్రము, వేదాంతము, అవసాన దశలో వ్యాకరణమూ సంపూర్ణముగా అభ్యసించినవారు. బరూరి త్యాగరాయ శాస్త్రులు వారు ప్రచురించిన గ్రంథాలు సమస్తమూ వారు వ్రాసినవే అనవచ్చు. తండ్రి పినతండ్రులిద్దరూ లౌక్యులు. ఇద్దరికీ స్త్రీ వ్యసనము కూడా లేకపోలేదని ప్రతీతి" - ఇది పితృపక్షము.
మాతృపక్షానికి వస్తే 'మాతామహుడు క్రమాంత స్వాధ్యాయపరుడు. వారి సోదరులూ పెద్దలూ స్వాధ్యయనము చేసిన అవధానులు. ఆయన ఆధానము చేసిన దీక్షితులు. చదువు రాదన్న మాటేగాని తల్లిగారు వినికిడి వల్ల పురాణాలన్నిటి తాత్పర్యమూ గ్రహించేది. ఇంటిలో పనులన్నీ అయిన తర్వాత సత్కథాశ్రవణము, పఠనము, మననము ఇత్యాది కాలక్షేపములతోనే పొద్దు పుచ్చేది. తెల్లవారుజామున పనిచేసుకుంటూ గజేంద్ర మోక్షము పాట - ఇత్యాదులు పాడుకుంటూ ఉండేది. రాత్రిళ్ళు పని అయిన తరువాత భజగోవిందము ఇత్యాది స్తోత్రాలు చదువుకుంటూ నిద్రపోయేది. డాంబికము లేని శిష్టతా, పదిమందితో కలిసి భజనలు చేయని భక్తిశ్రద్దలూ ఉండేవి.
సాహిత్య విమర్శ
559