"అమృలతుల్య మయ్యు, అదియేమొ జంకుచే మాట నోటరాదు.... మంగళాంబ!”
'మంగళాంబ' శబ్దాన్ని సంబోధనగాను. ప్రియురాలి నామధేయంగాను శ్లేషించాడు. చిన్ననాటి కావ్యపరిజ్ఞానం అప్పుడు బాగా పనిచేసింది.
వివాహం విచ్ఛిత్తి జరిగిన తరువాత గుర్వాజ్ఞ ప్రకారం సేతుస్నానానికి పోబోతూ, మంగళకు చెప్పిన “అర్చనీయో హి శంకర” అనే గంభీరవాక్కు ఆకల్పాంతం నిలిచిపోయేది.
చమత్కార వాక్యరచనలో అందెవేసిన చెయ్యి సరసవాణి. తన శాయశక్తులా బావగారి మనస్సులో ధార్మికయవనిక చాటున తారాడే దయారసకన్యను రంగం మీది కెక్కించింది. విఫలమైపోయింది. సమయాసమయ పరిచయము సరసవాణిలో సహజగుణం. అపర శివుడంతవాడిని -
“ఆహవముఖమునం దర్జునునట్లు
నిజకుమారివివాహ నిర్ణయమందు
వెనుకంజ వేసిన విప్రవీరునకు
గీతోపదేశమే కృష్ణుండు చేయు!”
అని సూటీపోటీగా మాట్లాడింది. ఆమె మాతృప్రేమే అందుకు కారణం.
విధివశాన చిన్ననాడే మంగళ విగతభర్తృక ఐపోయింది. చంద్రమౌళిలో సద్గుణాలు ఆమెను ఆకర్షించినవి. అతన్ని అవిదితంగా ప్రేమించింది. యౌవనానికి సహజమే! ముగ్ధ కావటం చేత ముందుగా తన హృదయం బయటపెట్టలేదు. అతని హృదయం గ్రహించి సందిటిలో అణిగిన తరువాత హృదయం గల యువతి కాబట్టి -
"అయ్యయ్యో నిష్కారణమ్ముగ
ఆధిపాలైనారు నాథా!
ఈ తపస్విని అంతరంగం
బెరుక పడకుంటన్”
అని నొచ్చుకున్నది. ప్రథమరంగంలో ముద్దులు మూటగట్టే మాటలతో చంద్రమౌళిని మోహితుణ్ణిగా చేసింది. పెద్దలను త్రిప్పగలననే ధైర్యం ఆమెకు తోచింది.
556
వావిలాల సోమయాజులు సాహిత్యం-4