"దయ, దయ, దయ యని
దౌర్బల్యంబున
ఆక్రోశించెద
రతి సామాన్యులు”
అనుకున్నాడు. కాయిక సౌఖ్యం కన్నా నిర్వృతి కారణధర్మము ఘనమని తోచింది. మనస్సు మారిపోయింది. పిల్లకు పెళ్ళి చేయటానికి సాహసము లేదని సరసవాణితో సాకు చెప్పాడు. వృద్ధాచారమే ఆయనను లొంగ దీసుకున్నది. మనదేశంలో ఇప్పటికి ఇంతే.
నాటికలో స్వరమేళలకు ప్రాముఖ్యం ఎక్కువ ఉన్నది అదీకాక ఇదే నూతనము కావటం వల్ల ఇంతగా చెప్పవలసి వచ్చింది.
10
విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. స్వాతంత్ర్యం ప్రకటించి నాయకులు స్వతంత్ర రాజ్యాలు ఏర్పరుచుకున్నారు. దక్షిణదేశంలోని నాయక రాజ్యాలు ఆ విధంగా ఆవిర్భవించినవే. ఆంధ్రులు అవటం వల్ల ఈ నాయకులు తమ రాజ్యాలకు తెలుగుదేశం నుంచి పండితులను, కవులను, గాయకులను ఆహ్వానించారు.
ఆంధ్రదేశంనుంచి దక్షిణానికి వలస పోయిన వాళ్ళల్లో ఆచార్య అప్పయ దీక్షితుల పూర్వులు ఒకరు. ఒక వాడుక ప్రకారం వీరు వైష్ణవులు, స్మార్తులుగా మారిపోయినారట. కానీ, - వైష్ణవం వీరిని వదిలిపెట్టలేదు. అందుకనే కవి మంగళాంబ చేత
"ఆంధ్రులము మేము, ద్రావిడులనుట తగదు
స్మార్తులమె యైన కొంత వైష్ణవము కలిసె
తొల్లి రంగరాజాచార్యదుహిత తోత
రాంబ ప్రపితామహుని భార్య అగుటవలన”
అని అనిపించాడు.
“తండ్రి మధ్వాచారి, తనయుడారాధ్యుండు, తల్లి రామానుజ మతస్థురాలు” అనే సంప్రదాయం ఉన్న రోజులు అవి. వేదాంతదేశికులు తరువాత దృఢనిబంధనలు చేశారు.
550
వావిలాల సోమయాజులు సాహిత్యం-4