మన యనుంగు తల్లి మంగళజన్మంబు
బండరాయివోలె నుండవలెనె!"
ఇత్యాదులు తెలుగు జాతీయాలు.
“శాస్త్రేషు వ్యసనితా” అనే సంస్కృత సూక్తి, 'ఆరేయ పౌరుషేయాలు' 'ద్రావిడ బుద్ధి' - తదితరసంస్కృత జాతీయాలు కూడా నాటికలో అక్కడక్కడా కనిపిస్తవి.
సంస్కృతం మీద ఎంత ప్రీతి ఉన్నా సమాసము సామాన్యంగా మూడు మాటలకు మించి ఉండదు. అథవా ఎక్కడైనా కనిపిస్తే దానికి ప్రత్యేక రసప్రతీతి కారణం ఏదో ప్రకరణాన్ని బట్టి ఉన్నదన్నమాట!
కావ్యంలో త్రివిధధ్వని - వస్తుధ్వని, భావధ్వని, రసధ్వని - కళ్ళకు కడుతుంది.
తే. "నాకలోకాంగనావీటికాకరండ
మండితోన్నత నవసుధాఖండమట్లు
విరియుచున్నాడు శశి ఉడు వీథియందు
కళలు త్రిజగదుద్దీపన కారణుండు.”
వస్తువు ననుసరించీ, ప్రకరణాన్నననుసరించి సరణి మారటం సహజం. భావోద్రేకము, మనోవేదన అధికంగా ఉన్నప్పుడు పాత్రలు పకడ్బందీగా మాట్లాడవు. నాటికలోని వివిధ ప్రకరణాలలో వివిధ రీతులుగా సంభాషణతో పాటు రీతి మారిపోతుంది. కవిలో అందువల్ల రకరకాల రసవైచిత్ర్యము. కవులు సాధారణంగా తమ అనుభూతి అభిమతాన్ని కావ్యాల్లో చొప్పించటం కద్దు. బాధలో గాని పద్యం బయలుదేరదని శ్రీ శాస్త్రి గారు చెపుతుంటారు. ఆ విషయమే మంగళాంబ చేత
"సాగు నందురు రచన విశ్రాంతిలోన
బాధలో నీకు కవన మేపగిది కుదిరె?”
అని ప్రశ్న వేయించి, చంద్రమౌళి చేత -
“నీకు విదితంబు కాదె వాల్మీకి శోక
మొక్కయుదయాన శ్లోకత్వ మొందియుంట!"
(కావ్యస్యాత్మా స ఏవార్థస్తథా చాదికవేః పురా క్రౌంచద్వంద్వ వియోగోత్థః శోకః శ్లోకత్వ మాగతః - అని ఆనందవర్ధనాచార్యుని అభిమతము)
అని జవాబుగా చెప్పించారు.
సాహిత్య విమర్శ
543