Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంస్కృతి కలవాళ్ళు సహజంగా భావోద్రేకాన్ని భరించలేని సమయంలో మహాకవుల మహనీయవాక్యాలు పఠించటం కద్దు. ఆ విధంగా చూస్తే నాటి కాలంలో సంస్కృత శ్లోకపఠనమే సమంజసమనిపిస్తుంది.

8

పద్యనాటికల్లో కవిని పట్టి చూపేది ఛందస్సు. పాత్రలన్నీ ఒకటే ఛందస్సులో మాట్లాడితే వెగటు పుడుతుంది.

ఛందోదేవి శ్రీ శాస్త్రిగారు చెప్పినట్లు వింటుంది. ఆయన దేశీయచ్ఛందో బహుళతను గ్రహించి, వాటితో అనేక నడకలు నడిపించవచ్చునని తెలుసుకొని అప్పయ్య దీక్షితులనోట ఆ మాట

“అతిమనోహరమైనదే ఆంధ్రభాష
అన్నిరీతులు పద్యంబు లల్ల వచ్చు”

అని అనిపించాడు.

రసస్ఫూర్తినిబట్టి రకరకాల ఛందస్సు ప్రయోగించడం శాస్త్రిగారికి అలవాటు. పద్యం, గేయ నాటికలలో వారు వాడేవన్నీ జాతీయ ఛందస్సులే. ఆటవెలది, తేటగీతి, మంజరి, రగడలు, షట్పదులు, ముత్యాల సరాలు. జాతీయఛందస్సుల కున్నంత గానయోగ్యత (Musical Element) లేకపోవటం వల్ల వృత్తాల జోలికి పోరు. ఉత్పలమాలాదివృత్తాలు దీర్ఘమై సంభాషణకు ఇమడవుకూడాను. లేకపోతే సకృతుగా కృతులపద్ధతి అవలంబిస్తారు. కృతుల పోకడ పోతే పల్లవి, అనుపల్లవులతో కథాగమనం మందగిస్తుంది. మాత్రాఛందస్సులు ప్రయుక్తమైతే కావ్యం మజాగా నడుస్తుంది. కానీ తాళ లయజ్ఞానం తప్పకుండా ఉండాలి.

దీక్షితులు దేశీయఛందస్సులలో హుందా ఉన్న ఆటవెలది, తేటగీతులలో మాట్లాడతాడు. కానీ, సరసవాణి మధురమంజరీ ధోరణిలో పడిపోయి, పునర్వివా హాభిప్రాయం కలిగినప్పుడు సామాన్యమానవుల మాదిరిగా మనస్సంక్షోభం చెంది సరసవాణితో స్వాభిప్రాయం కల్పటానికి మంజరీఛందస్సులో మనోభావాలను వెలిబుచ్చాడు. సంక్షోభం మందగించిన తరువాత మళ్ళా శ్రోత్రియత్వము, గాంభీర్యము, సంస్కృతి ఆయనను ఆవరించాయి. మాత్రాఛందస్సులను, తత్తుల్యమైన మంజరులను వదిలివేసి ఆటవెలది, తేటగీతులలో అభిభాషణం చేశాడు.


సాహిత్య విమర్శ

541