'దీక్షిత దుహిత'కు అనుశ్రుతంగా వచ్చే ఐతిహ్యమే ఆధారం. ఈ నాటికీ విద్వాంసులు ఈ కథాకణిక చెపుతుంటారు. దీనికి పౌనభేదం ఉంది.
ఇంటిదగ్గర అప్పయ్య దీక్షితులు బాల వైధవ్యబాధ అనుభవించే కుమార్తెకు పునర్వివాహం తలపెట్టి పర్యాలోచనలో మానివేయటం ప్రథమ ప్రతీతి. పునర్వివాహ విషయంలో కాశీ పండితులతో సమాలోచన చెయ్యటానికి పోయి, గంగాస్నానం చేసి సికతాతలం మీద సంధ్య వార్చుకుంటూ కూర్చుంటే, అప్రయత్నంగా అప్పయదీక్షితుల ధోతీ గోచికొంగు ఊడిందట. అపరశివావతారమని ఆయనను భావించే బ్రాహ్మణులు (అక్కడ జపం చేసేవారు) అదే శాస్త్రవిధిగా భావించి అనుకరించారు. కళ్లు తెరచి చూచిన దీక్షితులకు అది ఆశ్చర్యం కొలిపింది. సంధ్య వార్చేటప్పుడు కౌపీనం తొలగకూడదు. జంకి తానే పునర్వివాహం చేస్తే ధర్మ విప్లవము జరుగుతుందని తిరిగీ వచ్చాడనేది రెండోది.
కవి వీటిలో ఏదీ గ్రహించలేదు. పునర్వివాహం చేతామా అని సంశయించటమే ప్రధానాంశంగా పరిగ్రహించాడు. వస్తు పరివర్తనలుగ, ఇతివృత్త కల్పనలో మిగిలిన అందచందాలు అన్నీ కల్పితాలే.
నాటికా నామకరణంలో కృత్యాద్యవస్థ కలిగింది. మొదట 'విధిరేవ బలీయాన్' అనీ - తరువాత ఎప్పుడో భవభూతి చదువుతుంటే "సర్వంకషా భగవతీ భవితవ్యతైనా” అనీ అనుకున్నారట. 'పద్మావతీ చరణ చారణ' చక్రవర్తీ' - అంత పొడుగుపాటి పేరు పెట్టిన కవికి ఇవ్వొక్క లెక్కా? దీర్ఘమని సంశయించలేదు గానీ శ్రవణ సౌఖ్యం లేదని మానివేశారు. 'నామకరణాచార్యులకు నాటికకు పేరు దొరక్క పోతుందా? 'దీక్షిత దుహిత' అని చివరకు తీర్చి దిద్దారు.
పాత్రల నామ పరిగ్రహణానికి కూడా కొంత చరిత్ర ఉంది. ఐతిహ్యంలో అప్పయ్య దీక్షితుల పేరు తప్ప తక్కినవేమీ లేవు. ఆమె మరదలు 'సరసవాణి' అని ఎప్పుడో విన్నారట శ్రీ శాస్త్రిగారు. సంస్కృతి సంపాదించినదనీ, చమత్కారంగా చర్చ చెయ్యగలిగేదనీ విద్వజ్జనులు చెప్పుకుంటారు. సరసవాణి కావటం వల్లనే 'సరసవాణి' అనే అభిధానంతో ఆమెను స్వీకరించారు. ఆమె విగత భర్తృక అని వినికిడి. మంగళాంబ విధవ. విశ్వస్తలను విరివిగా రంగంమీదికి రప్పించడం ఇష్టంలేక ఆమెకు కవి పసుపు కుంకుమ పంచి పెట్టాడు. ఎవరో దాక్షిణాత్య పండితుడు సంస్కృతంలో 'అప్పయ దీక్షితేంద్ర విజయం' రచించాడు. ఆ గ్రంథాధారాలతో భారతిలో ప్రకటితమైన ఒక వ్యాసంవల్ల దీక్షితులకు ఉమా మహేశ్వరుడు, నీలకంఠుడు, చంద్రావతంసుడు అనే
534
వావిలాల సోమయాజులు సాహిత్యం-4