Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'దివ్య లోచనములు', 'క్రుద్ధముని', 'శిష్యురాలు' తదితర సంపాద ఖండికలు కూడా పద్యనాటక వాకోవాక్య దృక్పథంలో జన్మించినవే.

నవ్యసాహిత్యం బాగా పేరు ప్రతిష్ఠలు సంపాదించిన ఈ రోజుల్లో నైనా మన భాషలో గీతి నాటికలు, పద్యనాటికలు విశేషంగా లేవు.

శ్రీ శాస్త్రిగారి నాటికలను అవతల పెడితే ఉన్న పద్యగీతి నాటికలు క్రీ.శ. 1927 ప్రాంతంలో శ్రీ కోటమర్తి చిన రఘుపతిరావుగారి 'సుయోధనవిజయము' లో అన్నీ సీసపద్యాలు. పఠనయోగ్యత ఉన్నంత, ప్రదర్శన యోగ్యత కనపడదు. తరువాత, శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారి 'భాగవతావతరణము', 'షణ్ణవతి', ఇతరులవేవో కొద్దిగా ఉన్నవి.

3

శివశంకర శాస్త్రిగారి పద్య గీతి నాటికలు పదికి మించాయి. సంస్కృత నాటికాలక్షణం వీటికి పట్టదు. ఆ దృష్టితో వ్రాసినవి కూడా కావు. 'నాటిక', 'రూపిక' పదాల్లో 'క' ప్రత్యయము కేవలం అల్పార్థానికే.

వీరి కృతులలోని ఆనందం అనుభవించాలంటే పఠితకు, శ్రోతకు, ప్రేక్షకుడికి ఎంతో రసికత - అంతకన్నా విశేషజ్ఞత ఉండాలి. నాటికలన్నీ జీవిత లక్ష్యాలుగా ఉండి నానాప్రపంచాలలో నడిపిస్తవి.

కావ్యవస్తు గ్రహణంలో ఈ కవికి విశిష్టత ఉంది. ఇతివృత్తం ఏదైనా ఉత్పాద్యమే అనిపిస్తుంది. ప్రతి నాటికలోను ప్రథమాశయంలో మార్పు. బహురస సమ్మేళనము, పాత్రవైవిధ్యము, అందువల్లనే ద్యోతకమౌతవి. పవిత్రత, ప్రేమ, ఉత్కంఠ, చిత్తక్షోభ, అనుతాపము, సౌశీల్యము, శాంతమధురిమ, తొణికిసలాడుతాయి. ప్రతినాటికా బాహ్యాంతర ప్రపంచాలకు ప్రతిబింబము.

4

పద్యరచన ప్రారంభించిన ప్రథమ దశలోనే (క్రీ.శ. 1908 ప్రాంతము) పెద్దలు చెప్పుకోవటం వల్లనో, తరువాత తండ్రిగారి వల్ల స్వయంగా వినటం చేతనో 'దీక్షిత దుహిత' కావ్యరచన చేతామన్న అభిలాష కలిగిందట. ఆ రోజుల్లో వ్రాస్తే ఏ ఖండకావ్యమో అయ్యేదిగాని, సర్వాంగ సుందరమైన ఈ నాటికగా పరిణమించేది కాదు.


సాహిత్య విమర్శ

533