పత్రికలవల్ల వ్యాసం అనే నూతనకావ్య భాగం తెలుగువచనంలో వచ్చి చేరింది. క్రీ.శ. 1872 నాటినుంచీ నాటక వాఙ్మయం బయలుదేరి వచన రచనాభివృద్ధికి పనిచేసింది. వీరేశలింగంపంతులు వచనంలో ప్రత్యేకత వున్న నవలాసాహిత్యాన్ని మనదేశంలోకి తెచ్చినాడు.
లోకరంజని పత్రికలో వుండే విషయాలను గురించి వ్రాస్తూ సంపాదకులు, “ఈ పత్రికలో నవరసములైన కథలు కూడా వుంటా" యని వ్రాశారు. కథావాఙ్మయం అందులో ప్రత్యేకంగా కథానికాసారస్వతం (చిన్నకథ) సాటిలేకుండా అభివృద్ధి పొందుతుంది. ఈ శతాబ్దిలో జీవిత చరిత్రలు, ఆత్మ కథలు కూడా వచనరచనలో ప్రత్యేకతను సంపాదిస్తూ ఆ వైఖరిని తెలుగులోకి తెచ్చినవాళ్ళను జీవన్మృతులను చేస్తూ వున్నాయి.
చిన్నయసూరి తెచ్చిన కృత్రిమ భాషారచన చాలాకాలం వచనరచనకు ఒరవడిగా ఉంటూ వచ్చింది. పూర్వం నుంచీ వస్తూ ఉన్న మార్గాన్ని వదలివేసిన వచన రచనా పద్ధతి మంచిది కాదని, ఆ అపమార్గాన్ని తప్పించి జీవద్భాషలో వచనరచన జరగాలని శ్రీ గిడుగువారు చేసిన కృషి మూలంగా ఆ కృత్రిమభాష పోతూ వుంది. చాలావరకు, సక్రమమైన మార్గంలో రచన జరిగితే మన వచనం సజీవంగా ఉండి, ఇంకా కొన్ని భాషలకు మేలు బంతి కూడా ఔతుందేమో! - ప్రతిభ Vol IV 2, 3
సాహిత్య విమర్శ
531