“అంతట రుష్యమూక పర్వతాన్ని కనుగొని వోయీ జనకజా! యీ రుష్యమూక పర్వతమందు సుగ్రీవునికి నాంకున్నూ సఖ్యమైనది నింన్ను రావణుడు లంకకు యెత్తుక పొయ్యేటప్పుడు నీవంట్టి సొమ్ములన్నియు తీసి యీ రుష్యమూక పర్వతమందు పడవేశిపోగా యీ సుగ్రీవుడు నీ యొక్క సొమ్ములంన్నియు పదిలం చేసి వుంచి నా చేతికి తీసుకవచ్చి యిచ్చినచోటు. కనుగొంట్టివా చూస్తివా యీ యొక్క సరోవరం. వో సుదతీ నల్లకలువల చాతనున్నూ మంచి నిర్మలోదకం చాతను నొప్పుచున్నది. తుంమ్మెదలు ఝంకారంలు చేస్తుంన్ను తామరకమలమందు వ్రాలి మధుపానం చేస్తున్ను రెక్కలు విసురుతూ యెగుస్తూవున్నవి”
బ్రౌన్ దొర వ్యావహారిక భాషలో అనేక వచనాలు వ్రాయటమే కాకుండా, రావిపాటి గురుమూర్తి శాస్త్రికి, జూలూరి అప్పయ్యవంతులకు ప్రోత్సాహం ఇస్తే వ్యావహారిక భాషలోనే టీకాలు, ఉదాహరణ గ్రంథాలు, కొన్ని శాస్త్రగ్రంథాలు రచించారు. గురుమూర్తి శాస్త్రి వ్యావహారిక భాషలో బాలుర ఉపయోగార్థం వ్యాకరణం రచించాడు. చిన్నయసూరి బాలవ్యాకరణానికి పూర్వం బడుల్లో అదే వుండేది. ఈ శతాబ్దిలో యాదవాచార్యుడు, గజేంద్రుడు మొదలైన కవులు వచనరచన చేశారు. యాదవాచార్యుడు ప్రహ్లాదయక్షగానం కూడా చేశాడు. ఈ శతాబ్దిలోనే వచనంలో కథావాఙ్మయం పుట్టింది. ద్వాత్రింశత్సాల భంజికల కథలు, విక్రమార్కుని కథలు, రామలింగని కథలు, శుకసప్తతి కథలు, పంచ తంత్ర కథలు, మర్యాద రామన్న కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, బాల నాగమ్మ కథ, కాంభోజ రాజు కథ ఇటువంటివి ఇంకా యెన్నో వాడుక భాషలో వ్రాశారు. ఈ కథాసారస్వతంలో భాష జీవద్భాష. ఉదాహరణంగా కాంభోజరాజు కథలోనుంచి కొంతభాగం చూడండి:
"ఎందునిమిత్తము పాపాత్ముడైనాడంటే యేడుగురు భార్యలను వివాహం చేసుకున్నాడు. ఏడో భార్య మాణిక్యాల దేవిని పుణ్యపాపముల విచారణ చేయకుండా ఘోరమైన అరణ్యంలో... ప్రాణాలు తీసినాడు గనుక ఆ స్త్రీ హత్యగొట్టి రాజుగారికి ఘోరమైన వ్రణము లేచియున్నది. ఆ వ్రణము మాన్పేటటువంటివారు లేరురా తండ్రి. ఒక పాపాత్ముడగు వైద్యుడు వచ్చి ఆ వ్రణమునకు ఏమి ఔషధము చెప్పినాడనగా...” ఈ కథావాఙ్మయంలో భాష ముఖ్యంగా కొన్ని కథల్లోది ఎంతో అందంగా వుంటుంది. ఈ కథలలో మధ్యమధ్యా పదవాఙ్మయం కూడా వుంటుంది. ఉదాహరణంగా గాంధారి కథలో కొంతభాగం చూపిస్తాను.
528
వావిలాల సోమయాజులు సాహిత్యం-4