Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాభారతం రచించాడు. అతని వచనం పద్యాల మాదిరిగానే ఎంతో హుందాతో నడుస్తుంది. నన్నయ వచనంలో సంస్కృతంపాలు ఎక్కువ. వచనంలో కూడా ఆయన రసోచితంగా ఆరోహణావరోహణలు చూపిస్తాడు. నన్నయ వచన సంప్రదాయానికి ఒక ఉదాహరణం :

"శకుంతల కెంతయు సంతోషంబుగా దానికి కోరినవరం బిచ్చి గాంధర్వ వివాహంబున నభిమతసుఖంబు లనుభవించి యక్కోమలి వీడ్కొని నిన్నుఁ దోడ్కొని రానస్మత్ప్రధానవర్గంబుఁ గణ్వమహాముని పాలికిం బుత్తెంచెద” ఈ వచనంలో శబ్దాలు కటువుగా కాకుండా సున్నితంగా అంగలమీద గుర్రం నడుస్తుంటే వుండే హాయి చూపిస్తూ రచించాడు.

నన్నయ తరువాత కొద్దికాలానికే ప్రత్యేక గద్యకృతులు పుట్టినట్లు కనిపిస్తుంది. 12వ శతాబ్ది మధ్యభాగంలోని పాల్కుర్కి సోమనాథుడు తన కాలానికి గద్య ప్రబంధాలు విరివియై, సంస్కృత పదబాహుళ్యం వల్ల జనసామాన్యానికి రుచింపక పోయాయని పండితారాధ్యచరిత్రలో -

"ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠరచన
మానుగా సర్వ సామాన్యంబు గామి
జాను తెనుంగు విశేషము ప్రసన్నతకు”

అనీ, బసవపురాణంలో -

"ఉరుతర గద్యపద్యోక్తుల కంటె
సరసమై పరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట”

అనీ చెప్పినాడు. కాబట్టి 12వ శతాబ్దికే గద్యకృతులు అనేకం రచించినారనీ, అవి కృతకశైలిలో ఉండటం వల్ల ప్రజాదరణం కోల్పోయాయనీ తెలుస్తూ వుంది. పన్నెండో శతాబ్దిలో శైవకవులు కన్నడంలో మణిప్రవాళ శైలి వదిలి వేసి సులభశైలిలో అనేక వచన కావ్యాలు రచించారు. మన తెలుగు దేశంలో ఆ నాటి శైవకవులు వచన గ్రంథాలు వ్రాసేవుంటారు. మన భాషలో, అవి జాను తెనుగులోనే వుండి వుంటాయి. ఆ కారణం వల్లనే తిక్కన శైలి జానుతెనుగు కావలసి వచ్చింది. తిక్కన వచనంలో జాతీయత బాగా కనుపించటానికి కారణం కూడా అదే.


సాహిత్య విమర్శ

523