వచన కావ్యాలు - రచనావిధానం
జనసామాన్యానికి, అంటే మన భాషాచరిత్రతోనూ, సాహిత్యచరిత్రతోనూ పరిచయం లేనివాళ్ళకు మన భాషలో వచనరచన చిన్నయసూరితోనూ, తరువాత ఆంగ్ల వాఙ్మయ ప్రోద్బలం వల్లనూ ఉద్భవించి దినదిన ప్రవర్ధమానం అయిందని మాత్రమే తెలుసు. నిజానికి బహుకాలంనాడే పుట్టి అప్పటినుంచీ అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఆంధ్రభాషకు నన్నయే ఆదికవి అనీ, అంతకు పూర్వం అజ్ఞాతయుగమనీ వ్యవహరిస్తున్నారు. కాని, ఆయనకు పూర్వమే ప్రాచీన లక్షణ గ్రంథాలు వున్నాయట. నన్నయకు ప్రాచీనుడు దక్షిణ దేశంలోని ఒక ఛందోవేత్త 'యాప్పిరంగళ్' అనే ఛందో గ్రంథాన్ని రచిస్తూ "నేను వాంచియార్ (బహుశః వంచయ్య) అనే తెలుగుకవి లక్షణగ్రంథాన్ని అనుకరించా” నని చెప్పుకుంటాడు. లక్షణ గ్రంథాలు ఒక దేశానికి మార్గదర్శకమైనవి, బయలుదేరిన ఆ యుగంలో కావ్యాల పేర్లయినా తెలియక కాలగర్భంలో కలిసిపోవడం వింతగా వుంది.
కావ్యావళి కరువైపోవటం వల్ల ఆ అజ్ఞాతయుగం నాటి వచన సంప్రదాయాన్ని తెలుసుకోవాలంటే మనకు శాసనాలే ముఖ్యాధారం. అవైనా క్రీ.శ. ఏడవ శతాబ్దికి పూర్వంవి ఇంకా దృష్టిగోచరం కాలేదు. ఇప్పటికి లభ్యమైనవాటిలో ప్రాచీన మైనది తూర్పు చాళుక్యవల్లభుడైన జయసింహునిది. ఇది క్రీ.శ. 633 నాటిది. ఆ శతాబ్దిలోదే మంగిదొగరాజు లక్ష్మీపుర శాసనం (క్రీ.శ. 675) పశ్చిమ చాళుక్య విక్రమాదిత్యుని (క్రీ.శ. 655-680) ధర్మవరం శాసనం కూడా ఒకటి వుంది. ఇక ఎనిమిదవ శతాబ్దికి వస్తే అహదనకరశాసనం కనిపిస్తుంది. తొమ్మిదవ శతాబ్దిలో గుణగ విజయాదిత్యుని (క్రీ.శ. 854-897) ధర్మవరము శాసనము, అద్దంకి శాసనము కనిపిస్తాయి. పదో శతాబ్దిలో వచనంలో వున్న ప్రత్యేక శాసనాలు కనుపించలేదు. గ్రామచిహ్నాలను సూచించటానికి వచనం వాడేవారు, శాసనమంతా సంస్కృతంలో వుంటే.
అజ్ఞాతయుగంలో వచనరచనా విధానాన్ని తెలుసుకోవటానికి దిఙ్మాత్రోదాహరణాలు. “... సకలలోకాశ్రయ జయసింఘవల్లభ మహారాజులాకున్ ప్రవర్ధమాన విజయ రాజ్య సంవత్సరంబుల్ ఎణుంబొది అన్నేట్టి అమ్మన్పూణ్ణమ
520
వావిలాల సోమయాజులు సాహిత్యం-4