Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కథలను' ఆంధ్రీకరించి, కథాసాహిత్య లోకానికి అపూర్వసేవ చేశారు. ఈ జాతక కథలను అనువదించే సమయంలో వీరు అనేక భాషలలోని అనువాదాలను శ్రద్ధతో పరిశీలించి, అర్థస్ఫూర్తి కోసం అవసరమైన సమయాలలో బౌద్ధమతస్థుడైన కౌసల్యాయనుని అభిప్రాయాలను స్వీకరించటం ప్రత్యేకంగా గమనింపదగ్గ విషయము. వ్యాకరణశాస్త్రంలో విశిష్టపాండిత్యాన్ని ఆర్జించుకొన్న శ్రీ స్వామి, 1953-55 మధ్యకాలంలో "వ్యాకరణ దర్శనచరిత్ర" అనే రమారమి 1250 పుటల బృహద్గ్రంథాన్ని రచించారు.

1950 నుంచి నడుస్తున్న సాహిత్యలక్షణాలు ప్రత్యేకంగా శివశంకరులను క్లేశపెట్టటం వల్ల, సాహిత్య లోకాన్ని సక్రమమార్గంలోకి తీసుకువద్దామన్న సదుద్దేశంతో 1955లో అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించి, ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలలో గంభీరోపన్యాసాలిస్తూ తీవ్ర కృషి చేశారు. ఆ సందర్భంలో వీరు తాత్విక విషయాలమీద, సాంస్కృతిక విషయాలమీద కూడా ఉపన్యసించారు. అనేక మహా సభలల్లో మహావక్తలై ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు శ్రీ శివశంకరులు, 1935లో "సాహిత్యాచార్య”, 1938లో “కవీంద్ర", 1943లో "సాహిత్య సమ్రాట్", 1946లో “మహోపాధ్యాయ” 1959లో “కవిసార్వభౌమ", 1962లో “విద్యావాచస్పతి" ఇత్యాది బిరుదాలను పొందటం వల్లను, ఆంధ్రలోకానికి అమూల్యరచనలను ప్రకటించి ప్రసాదించటం వల్లను, 1960కి పూర్వమే అఖిలభారత సాహిత్య అకాడమీ వారు ఆకర్షితులై సభ్యులుగా ఎన్నుకొని, సన్యాసరూపంతో దర్శన మిస్తుండటం వల్ల విలక్షణంగా గౌరవిస్తూ పనులు చేయించుకోవటం, అభిప్రాయాలకు అధిక శ్రద్ధనివ్వటం జరిగింది. అట్టి స్థితిలో శివశంకరస్వామి 1961లో అకాడమీ వారి కోరిక మీద రవీంద్రుని 'గోరా'ను వంగభాష నుంచి యథామాతృకంగా యథార్థమైన వాడుక భాషను వాడుతూ, అవసరమైన చోట్ల సంభావ్యశ్రేణికి చెందిన పదజాలాన్ని ప్రయోగిస్తూ ఆంధ్రీకరించారు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1968 ప్రారంభంలో శ్రీ శివశంకరులకు సభ్యత్వాన్ని, కార్యనిర్వాహక సభ్యత్వాన్ని, ఉపాధ్యక్ష పదవిని, 24-8-68న విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించారు. మహాసంస్థ పక్షాన శివ శంకరస్వామి అనేక పదవులను నిర్వహిస్తూ ఆంధ్రశతకసంపుటాలకు సంపాదకత్వం వహించటం "శ్రీకృష్ణ లీలాతరంగిణి"ని ముద్రింపజేయటం మొదలైన ప్రయోజనాత్మకమైన పనులెన్నో చేశారు. ఈ కాలంలో 'దేహళి' అనే సాహిత్య మాసపత్రికను ప్రకటించటానికి యత్నించారు.


514

వావిలాల సోమయాజులు సాహిత్యం-4