సాహిత్యభావ భాషాపారిశుద్ధ్యాన్ని గురించీ, సాహిత్య ప్రయోజనాన్ని గురించీ, భవిష్యత్కార్య ప్రణాళికను గురించీ గంభీర వాల్గుంభనతో వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే వావిలాల సోమయాజులు గురుదేవులైన శివశంకరులకు తన “నాయకురాలు” నాటకాన్ని అంకితం చేయటం జరిగింది. 1935 తరువాత శ్రీ శివశంకరులు ప్రతిభాధురీణులు, ప్రజ్ఞావంతులు అయిన రచయితలను నూతన సభ్యులుగా చేర్చుకుంటూ, తమ అస్తమయం వరకు సాహితీసమితిని పటిష్ఠంగా నడుపుతూ వచ్చారు. వీరు తరువాత కొద్దికాలానికి డాక్టర్ మారేమండ రామారావు నడిపే ఆంధ్రీతిహాస పరిశోధన మండలికి "సాతవాహన సంచిక" అనే మహా గ్రంథాన్ని ప్రకటించటంలో ఎంతగానో తోడ్పడ్డారు. వీరి తోడ్పాటువల్లనే సాతవాహనుల కాలంనాటి సాహిత్యాది విషయాలమీద చక్కని వ్యాసాలు పై సంచికకు లభించటం జరిగింది.
శ్రీ శివశంకరులు అద్వైతసంప్రదాయులు, భక్తితత్పరులు కావటం వల్ల వీరికి రామానుజులవారి గద్య త్రయాది గ్రంథాలు ప్రాణతుల్యాలయినవి. వీరికి ఆర్యసమాజ, బ్రహ్మ సమాజ, దివ్యజ్ఞాన సమాజాలతోను, సి.వి.వి. సంప్రదాయంతోను కొంతకాలం ప్రబల పరిచయాలు కలిగాయి. 1947లో వీరికి పారమార్థిక దృష్టి విస్తరించటం వల్ల, వంశ మర్యాదను అనుసరించి యతీశ్వరులై కాషాయాంబరధారణ చేయటం జరిగింది. వీరు 1948లో వేటపాలెం చేరి తీర్థాశ్రమాన్ని స్థాపించుకొని సన్యస్త జీవితాన్ని గడపటం మొదలు పెట్టారు. కాని సాహిత్యలోకం వీరిని, వీరు దానిని విడిచిపెట్టటం కష్టం కావటం వల్ల, వీరు సాహిత్యలోకానికి దూరులు కావటం జరుగలేదు.
అనతి కాలానికే వీరి పుత్రులు, సాహిత్య రచయితలు అయిన శ్రీ కృత్తివాసతీర్థులు కళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా ఉద్యోగిస్తున్న ఒంగోలు చేరటం, అక్కడ బహువిధ సాహిత్య వైజ్ఞానిక వ్యాప్తి కోసం 1951లో 'కవిత్రయ సమాజాన్ని', 1952లో అఖిలాంధ్ర పరిషత్తును స్థాపించటం జరిగాయి. 9-9-52న సహజంగా జరిగిపోయిన వీరి షష్టిపూర్తిని వేటపాలెంలో సాహిత్య మిత్రులు 1-4-53న మహోజ్జ్వలంగా జరిపించి, కృతజ్ఞతను వ్యక్తీకరించి మహానందాన్ని పొందారు. తరువాత అనతికాలంలో ఆనాటికి వచ్చిన శ్రీ శివశంకరుల కవిత్వకృతులన్నీ రెండు బృహత్సంపుటాలుగా ముద్రితాలయినవి.
1951-52లలో శివశంకర స్వామి బహుదేశ ప్రాచ్య పాశ్చాత్య కథా వాఙ్మయానికి ఆధారభూతములని వేత్తలు అంగీకరించిన పాళీభాషలోని 547 బుద్ధుని 'జాతక
సాహిత్య విమర్శ
513