గేయ ఖండకావ్యాలను, కావ్యాలను, పద్యగేయ నాటికలను రచించారు. 1940- 41లో వీరు కొంతకాలం మదరాసులో నివసించి సినిమారంగ రచయితగా వ్యవహరించారు. "ఆ సమయంలో వీరు విశ్వామిత్ర పాత్రను అభినయిస్తా”రని పత్రికల్లో ప్రకటన జరిగినపుడు సాహిత్యకులు ఎంతో సంతోషించారు. కానీ అది జరగలేదు.
ఉత్తమ వక్తలు, సంభాషణచతురులు, జంగమ విజ్ఞానసర్వస్వ స్వరూపులు అయిన శివశంకరులు సాహిత్యకళా సభలను నడిపించటంలో కడు సమర్థులు. కనుక యావదాంధ్రదేశంలో ఆ మహాసభలు జరిగించవలసి వచ్చినపుడు, ఆహ్వాన సంఘ సభ్యులు వీరిని అభ్యర్థించి పిలిపించుకోవటం సర్వసామాన్యమైపోయింది. స్వామి శివశంకరులు 1943లో రాజమహేంద్రవరాన శ్రీ శొంఠి రామమూర్తి పంతులుగారి అధ్యక్షతన జరిగిన వేంకట పార్వతీశ్వరకవులు షష్టిపూర్తి సన్మానసభలను మహాసామర్థ్యంతో రమ్యాతిరమ్యంగాను, మనోహరంగాను నడిపించారు. తరువాత ఈ 1943లోనే ఆంధ్రప్రచారిణీ గ్రంథమండలికి గౌరవ సంపాదకత్వం వహించి వీరు ఖండకావ్య, నాటికా, కథాసంపుటాలను, ప్రయోజనకరమైన తమ అమూల్య పీఠికలతో ప్రచురింపచేయించారు. ఈ సమయంలోనే శివశంకరస్వామి పాశ్చాత్య కథాసాహిత్యానికి మూలపురుషు డనదగ్గ బొకాషియో “డికామెరన్”, “హెక్టామెరిన్"లలో అనుసరించటం కూడా జరిగిన సోమదేవసూరి కథాసరిత్సాగరమనే జగద్విఖ్యాత కథాకథన మహాగ్రంథాన్ని సామాన్య పాఠకలోకానికి సంతృప్తి కలిగేటట్లు ఆంధ్రీకరించి, ఆంధ్రప్రచారణీ గ్రంథమాలచేత ఆరు మహాసంపుటాలుగా ప్రచురింపజేయించి గొప్ప కథాసాహిత్యసేవ చేశారు.
శ్రీ శివశంకరులు 1948లో తెలుగు భాషా సమితి అధ్యక్షులైన శ్రీ బెజవాడ గోపాలరెడ్డి మహాశయులు, శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ సంపాదకత్వాన ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం మూడవ సంపుటిలో వ్రాసిన కేతన పంచతంత్ర కవులు, కంకంటి పాపరాజు, పినవీరభద్రుడు, మారన, సూరనలవంటి వ్యాసాలు వారి ప్రాచీనాంధ్రకవుల మీది అభిమానవిధానానికి, వారికిగల విజ్ఞాన ప్రదర్శనకు దిజ్మాత్రసూచనలు. 1925లో ఆత్మపరమైన కావ్యసంపుటి అయిన "హృదయేశ్వరీ" అన్న ప్రసిద్ధ మహాకావ్యాన్ని ప్రచురించిన తరువాత, బహుకాలం తమ కృతులను వేటినీ ప్రచురింపని శివశంకరస్వామి 1945లో “కావ్యావళి" అనే పద్యగేయ కావ్యాన్ని, 1946లో “రత్నాకరము” అనే గేయ కావ్యసంపుటిని "దీక్షిత దుహిత" అనే పద్యనాటికను ప్రచురించి, యువనవ్య సాహిత్యకులకు తమ కవిత్వవైశిష్ట్యాన్ని ప్రథమతః ప్రదర్శించారు.
సాహిత్య విమర్శ
511