Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ 1935లోనే స్వామీ శివశంకరులు సహాయం మూలంగా సంతరించు కోగలిగిన ఆధునిక కవుల రచనాసంకలనమైన “వైతాళికుల” ను జ్వాలాపత్రిక సంపాదకులు శ్రీ ముద్దుకృష్ణ ప్రకటించటం జరిగింది.

నవ్యసాహిత్యాన్ని సర్వతోముఖంగా వికసింపజేయాలనే మహాశయంతో గురుభాగవతుల ధర్మారావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి మొదలైన బరంపురంలోని రచయితలు 1933లో స్థాపించిన “అభినవాంధ్ర కవి పండిత సభ" అనంతపురంలో మూడవమారు 1935లో వార్షికోత్సవం జరుపుకుంటూ, శివశంకరస్వామిని అధ్యక్షులుగా వరించటం జరిగింది. ఆ సందర్భంలో ఏవో కొన్ని కారణాల వల్ల సాహితీ సమితిలో నుంచి కొందరు సభ్యులు విడిపోయిన తరువాత, సాహిత్యకులకు అందరికీ ఒకే సంస్థ లేక పోవటాన్ని గురించి చర్చలు సాగించి, శివశంకరస్వామి బరంపురం రచయితల మహాసంస్థగా రూపొందించారు. ఇలా నవ్యసాహిత్య పరిషత్తుకు మూలకారకులై, తరవాత వీరు 1946 వరకు ఆ సంస్థకు సర్వతోముఖ సంరక్షకులుగా వ్యవహరిస్తూ మహోన్నతంగా నడిపించారు.

నవ్య సాహిత్య పరిషత్తు 1939లో పత్రికాప్రచురణ చేయటానికి నిశ్చయించు కొన్నప్పుడు నామకరణ కళావేత్తలైన శివశంకరస్వామి ఆ పత్రికకు 'ప్రతిభ' అని నవ్య సాహిత్య పరిషత్తు లక్ష్యాన్ని, భావ ప్రాధాన్యమును వ్యక్తం చేస్తూ పేరు పెట్టారు. తరువాత ప్రతి సంవత్సరం జులై, అక్టోబరు, జనవరి, ఏప్రిల్ నెలల్లో వచ్చే ఈ ప్రతిభ అనే త్రైమాసపత్రిక ప్రథమసంచిక అయిన వసంత సంచికను విద్వత్కవులు, సాహితీ సమితి సభ్యులు అయిన శ్రీ కొమండూరి కృష్ణమాచార్యులవారిచేత ప్రారంభింపచేయిస్తూ అందులో వారిచేత -

"ధరణి వాణీవిలాస సౌధము లనంగ
గ్రాలు కవితల్లజుల మహాకావ్యములకు
కారణంబయి పూర్వసంస్కారగరిమ
నెగడు ప్రతిభకు బ్రహ్మాయు వగును గాత!"

అని ప్రతిభ అతిశయాన్ని వెల్లడిచేయించారు. సంపాదకవర్గ సభ్యులుగాను, గ్రంథ నిర్ణాయక సభ్యులుగాను “చాలనీ”లో గ్రంథ విమర్శకులుగాను, ప్రముఖ రచనా సంపాదకులుగాను, రచనాప్రదాతలుగాను వ్యవహరించి, వీరు నవ్య సాహిత్య ప్రచారానికి, ప్రకటనలకు 'ప్రతిభ', 'భారతి' కంటే ఉత్తమ కేంద్రమై పోయేటట్లు కృషి చేశారు.


సాహిత్య విమర్శ

509