Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాదృశ్యాన్ని గమనించి ఎంతవారైనా ఎవరైనా ముగ్ధులైపోతారు. నవ్యసాహిత్య ప్రపంచంలో క్రొత్తరీతులకు త్రోవ చూపించింది, క్రొత్తరుచులు ఎరిగించింది, కవితాకన్యను మనోహరంగా, వింతగా చూడముచ్చటగా అలంకరించిందీ, ఆమెకు క్రొత్త పోకడలు నేర్పింది నవకవులందరిలోకి తొలుదొలుత శివశంకరశాస్త్రి గారే. నవ్యభావ విజ్ఞాన రచనావిధానోదయానికి ధ్రువతార శ్రీ శాస్త్రిగారు. ఇది అంతా ఆయన చలవ. ఆయన చూపని సులభోపాయం లేదు. కావ్య రచనావిధానానికి అవుననకపోయినా అనుకరించిన ఆధునికులు లేరు" ఇత్యాదిగా వ్రాశారు.

ఈ సమయంలోను, తరువాత అనతికాలంలోను శివశంకరస్వామి నవలా రచయితలకు కథారచయితలకు పత్రికాధిపతులకు తెలుగు భాషా (వ్యావహారిక భాషా) స్వరూపాన్ని నిరూపించి ప్రదర్శించటం జరిగింది. ఈ విషయాన్ని గురించి సుప్రసిద్ధ కథారచయితులైన శ్రీనివాస శిరోమణి "వినోదిని” అనే హాస్యరస మాసపత్రికకు సంపాదకులుగా ఉంటూ, 1935 ఆగస్టు నెలలో ఇలా వ్రాశారు.

"ఆఖ్యాయికా పరంపరంలో మునిగి తేలుతూ ఉన్నాడు... శ్రీ శివశంకరశాస్త్రి నోటి మాటలు కాకుండా - బహుభాషావేత్త. సాక్షాత్తు సదాశివస్వరూపుడు - తెలుగు వచనం ఇది అని నిర్ణయించుకొని వచనంలో వ్రాయడానికి పూనుకొన్నాడు... ఆయనది అప్పారావు పంతుల అతివాదము కాదు. రామమూర్తి పంతులవారి సుశిక్షిత మితవాదమున్ను కాదు తెనుగు స్త్రీ శిశు వృద్ధులు ఇంపుగా మాట్లాడుకుంటూ వ్రాసుకొని చదివి ఆనందించగల తెలుగు, ఆయన దృష్టిలో వ్యావహారికాంధ్రము గ్రాంథికాంధ్రము అంటూ లేవు. తెలుగు, ఆంధ్రము అని రెండుగా విభజించుకున్నాడు. డబడబా మోత మ్రోగేది, పద్యాలు వ్రాసేది ఆంధ్రము - ఇంపుగా చదువుకొనడానికి వీలు అయ్యే వచనము తెలుగు, అని ఆయన అభిప్రాయము. అష్టగ్రహముల లాంటివాళ్ళను ఎనిమిది మందిని చేర్చాడు. తాను గ్రహరాట్టులాగా మధ్య కూర్చున్నాడు. కలములు తీసి వ్రాయమన్నాడు. తెనుగువాళ్ళంతా ఆ రచనలకు ముగ్ధులయిపోయినారు. అట్లా వ్రాయడము ఎట్లాగని అనుకున్నారు. ప్రతివాళ్ళు అట్లా వ్రాయడము ప్రయత్నములు చేసినారు. 12 సంవత్సరములు దేశాన్ని దండయాత్ర చేసి సాధించలేకపోయిన రామమూర్తి పంతులవారి వాదాన్ని సంవత్సరంన్నరలో శ్రీ శివశంకరశాస్త్రులవారు అవశ్య ఆచరణీయము చేశారు. అంతవరకు మడికట్టుకొని సముద్రపు ఒడ్డున కూర్చున్న రెండు తెలుగు పత్రికలున్ను (ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ) అల్లావచ్చినవి ఏమి చేస్తవి? చోటివ్వక తప్పినది కాదు.”


508

వావిలాల సోమయాజులు సాహిత్యం-4