కాపాలికుణ్ణి ఖండఖండాలు చేసి ప్రియురాలిని రక్షించుకునే ఘట్టంలో నోట తేట గీతి పద్యం వచ్చింది. అంతట రెండు సంవత్సరాలకు, అంటే 1904న వీరు బంధువులు, విద్వద్వరేణ్యులు అయిన శ్రీ నోరి హనుమచ్ఛాస్తులవారి చరణసాన్నిధ్యంలో ఛందస్సు నేర్చుకోవటం వల్ల పద్యరచన, నాటకరచన సాగాయి. అప్పుడు వీరు 'మోహిని' మొదలయిన నాటకాలు, 'ఖుష్ రోజ్' మొదలయిన కావ్యాలు చెప్పటం, తండ్రిగారు వీరు సాహిత్య రచనలవల్ల జీవిస్తారని ఆనందించటం జరిగాయి. "అనవరత పంచాక్షరీ జపం చేత పవిత్రమైన అమృతవాక్కుతో ఆశీర్వదించి, 'పార్థివపూజ' చేత పరిపూతమైన పాణితో అభయమిచ్చిన అస్మత్తాత పాదులు శ్రీకృష్ణశాస్త్రులవారి తపోబలం చేతనే” తమ కవితాశక్తి విజృంభించిందని శివశంకరస్వామి విశ్వసించారు.
సింహలగ్న జాతకులైన శివశంకరస్వామి, చిన్నతనం నుంచి శరీర వ్యాయామం మీద కొంత కుతూహలం వహించారు. ఈతలో, గుఱ్ఱపు సవారీలో శక్తి సంపాదించారు. క్రికెట్, టెన్నిస్, బేస్ బాల్, అన్న ఆటలమీద ప్రీతి వహించి అధికప్రజ్ఞలను ఆర్జించారు. వ్యవసాయం మీద, ఉద్యానకళమీద ఆసక్తి వహించి శ్రమచేసి, తాము నిర్మించుకొన్న ఆశ్రమాలలో వాటిలో సంపాదించిన రమణీయ పరిశ్రమను, ప్రజ్ఞను ప్రదర్శించారు.
ఆధునిక సాహిత్యానికి ఆచార్యపీఠం వహించవలసి ఉన్న శివశంకర స్వామి, 1908లో తండ్రిగారైన శ్రీ కృష్ణశాస్త్రిగారు మరణించడం వల్ల, మెట్రిక్ లేషన్ పరీక్ష మొదటి రోజుననే ఆంగ్ల విద్యాభ్యాసానికి సంబంధించిన పాఠశాల చదువును పరిత్యజించారు. తరువాత 1909లో శ్రీ కంభంపాటి సీతారామశాస్త్రిగారి దగ్గర సంస్కృత కావ్యపఠనం, 1910లో వేదాంతం శ్రీరామశాస్త్రి గారి దగ్గర సాహిత్య కృషి, 1911లో మహానుభావులైన దెందుకూరి నరసింహశాస్త్రులవారి దగ్గర న్యాయశాస్త్ర పఠనం ప్రారంభించటం. 1913లో వేదాంతం లక్ష్మీపతిశాస్త్రిగారి దగ్గర వ్యాకరణ శాస్త్ర పఠనం, దెందుకూరి పానకాల శాస్త్రి గారి దగ్గర న్యాయశాస్త్ర పఠనం చేశారు. బహుభాషా ప్రియత్వం వల్ల వీరు 1911-12లలో బెంగాలీ, హిందీ భాషలు, 1913లో ఉరుదూ, పారశీక భాషలు అభ్యసించారు.
అన్యభాషలలో నుంచి నవలాసాహిత్యం అనువాదాన్ని పొంది విశేషంగా వస్తూ ఉండటం వల్ల, స్వామి శివశంకరులు నవలాసాహిత్య రచనాభిలాషతో 1912లో వంగభాషనుంచి 'నీరద' అనే నవలను, 1914లో 'అఖ్యాయికాపరంపర' అనే గ్రంథమాలను స్థాపించి, 'రఘునాథజీ' అనే నామాంతరం గల మహారాష్ట్ర భాషలోని “జీవన ప్రభాతం” అనే నవలను, వంగభాషనుంచి అనువదించి ప్రకటించారు.
502
వావిలాల సోమయాజులు సాహిత్యం-4