Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శివశంకర స్వామి

(1892-1977)

“కలనిస్వన కవికోకిల
కులకూజిత మధుర మధుర గుంజిత నవ మం
జుల సాహిత్యవనీ మధు
కులపతి, సురభిప్రభావ, గురుదేవ, శివా!" (నాయకురాలు)

మా గురువర్యులైన శివశంకరస్వామి మహాకవివర్యులు. మహనీయ వ్యక్తులు; మరపురాని మనీషులు. సముజ్జ్వల మహాసంస్థలు; సర్వతోముఖ సాహిత్య సేవకులు. నవ్యసాహిత్యాన్ని నానా రమణీయరూపాలతో అలంకరించి అభినందింప జేయటానికి అవతరించిన కారణజన్ములు. నవ్యసాహిత్యయుగ నిర్మాతలలో ప్రముఖులుగా పరిగణనీయులు. ప్రతిభావ్యుత్పత్తుల్లో సమాన సామర్థ్యం గల సాహిత్య శక్తిసంపన్నులు. సాహితీతపస్సే నిత్యవృత్తిగా, ఆంధ్రజాతికి పరమ ప్రయోజనకరంగా గడిపి, వందనీయమైన సహస్రమాస జీవితానంతరం సిద్ధి పొందిన అమృత జీవులు; చిరస్మరణీయులు.

శివశంకరస్వామి బహుభాషాకోవిదులు. “వివిధ శాస్త్ర పారావారాలను చుళుకించిన విద్వద్వతంసుడు”. సౌందర్య ద్రష్టలు. సరసహృదయులు. సంభాషణచతురులు; గోష్ఠీ ప్రియులు; మహావక్తలు. సాహిత్య కులగురువులు. నవ్యులకు ప్రాచీనులు; ప్రాచీనులకు నవ్యులు. సాహిత్య సంచార ప్రచారకులు, జంగమ విజ్ఞాన సర్వస్వ స్వరూపులు. మార్దవ సంయమనాలు ముఖ్యగుణాలుగా గల సాహిత్య మహావిమర్శకులు, అజాతశత్రువులు అయిన వీరి ప్రోత్సాహాన్ని పొందని నవ్య సాహిత్యకుడు లేడనటంలో అతిశయోక్తి అణుమాత్రం లేదు.

స్వామి శివశంకరులు ప్రధానంగా నవ్యసాహిత్యసృష్టికి మూలకందమైన సాహితీ సమితికి సభాపతులు; వ్యాప్తికి హేతుభూతమైన మహాసంస్థ అయిన నవ్యసాహిత్య పరిషత్తుకు సర్వతోముఖ సంరక్షకులు.


500

వావిలాల సోమయాజులు సాహిత్యం-4