Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



మధుభరితంబై క్రొత్తావిఁ గ్రమ్ము నరవిరి గుత్తి నొకదానిని వినయ వికుంచిత తనువై యర్పించుచు నొప్పినది. అనతికాలమునకుఁ దీఁగెయుయ్యలల నెక్కి తూఁగియాడుచుఁ గూడిపాడెడి మత్తాళిబాలికలను గని యొండొరులకుఁ జూపించుచు నలరులఁ గోయుచోట మధుపాళి మ్రోఁతకు ముగ్ధ లుల్కినం గలకల నవ్వుచున్న వారివిహార ప్రియుఁడగు రామచంద్రుఁడు' కన్పించెను. మఱియొక చోట

ఉ. [1]తుమ్మెద పిండు మెండుకొని త్రొక్కిన రేకుల సందు సందులం
    గ్రమ్మి చలత్తరంగ శిఖరంబులఁ దూలెడి తమ్మి పుప్పొడుల్
    కొమ్ముడులూడఁ గ్రమ్ము పొది లోపల నొక్కొకచోటఁ గెంపుచం
    దమ్మునఁ జెన్నుచేసె వనితల్ కమలాకర కేళి సల్ఫగన్.”

ప్రబంధ పరమేశ్వరుని యారామవీథిఁ బ్రవేశించి చూడ నట [2]జైత్రారూఢిఁ జిగురుం గెంజెడ లొప్పఁ బుష్పరజముల్ సెల్వార నున్బూది పూఁతగ లేదేఁటులు చుట్టుకోలు జపసూత్రశ్రీలుగాఁ గోకిల ప్రగుణాత్తాధ్యయనంబుతో శాంభవంబగు దీక్షావిధి నొంది యొప్పుచున్నది. మఱియొక దిక్కున వాగర్ధ ప్రణయమూర్తులైన యుమామహేశ్వరులు కేళీవిలాసములఁ దేలియాడుచున్నారు. పరమేశ్వరీ లీలారవిందము నందలి భ్రమరబాలుఁడు మన్మథమథనుని మానసవీథిని జీరనిద్ర నొందుచున్న చిత్తజాగ్నిని మేల్కొల్పుచున్నాఁడు. ఇది యనంగ విజయము అమ్మవారి కైంకర్యసమయ మని ముందున కేఁగ నిచ్చగింపక యందుండి యన్యవనములకుఁ బయనమైతిని.

'ఉల్లల దలకాజలకణ పల్లవిత కదంబముకుళ పరిమళ లహరీ హల్లోహల మదబంభర మల్లధ్వను లెసఁగ మరుదంకురములు నన్నాహ్వానించుచున్నవి. 'ఆవాత పరంపరా పరిమళ వ్యాపార లీల న్జనాన్విత మిచ్చోటని చేరఁబోయి’ యట నొక్కచో నిల్చి 'ఈ రమ్యవృక్షవాటిక లెవ్వరివి చెప్పుమా!' యని ప్రశ్నించుకొంటిని. 'నభో వాహినీలహరీ శీతలగంధవాహ పరిఖేలన్మంజరీ సౌరభగ్రహణేందిందిర తుందిలమ్ము లివి మత్కాం తార సంతానముల్' అనునొక కామినీకలస్వనము విన్పించినది. చకితుఁడ నగుచుండ మఱుక్షణమున నొక చంచల్లతావిగ్రహ, శతపత్త్రేక్షణ, చంచరీక చికుర, చంద్రాస్య, చక్రస్తని, నతనాభి, నవల నా యెదుట నిల్చినది. జ్ఞప్తి కెలయించుకొని 'ఓహో! నీవు మా యాంధ్ర కవితా పితామహుని యమృత దుహితవు నమరనర్తకివి, యా వరూధినివి కావా?' యని ప్రశ్నించి యేమో సంభాషింప నూహించు చున్నంతలోనే యటకుఁ 'జెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్' అనుకొనుచుఁ

బోవుచున్న తరుణాగ్నిహోత్రి ప్రవరుఁడు స్వాహావధూవల్లభుని యింటికిఁ జేర్పుమని
  1. 80. తుమ్మెదపిండు - పూర్వోదాహృతము ఆ. 8, ప. 52
  2. 81. చైత్రారూఢిం - ప్రబంధ పరమేశ్వరుని హరివంశము ఉత్తరభాగం ఆ. 7 ప. 68

50

వావిలాల సోమయాజులు సాహిత్యం-4