గొల్పుతూ ఒక కవితాకాంతి గూడా మెరుస్తూ ఉన్నది." రెండవ రచనలో ఈ లోపాలు కొన్ని లోపించి "స్వకీయమూ, పరిపూర్ణమూ అయిన వ్యక్తిత్వం” ప్రదర్శించాడు. నాటినుండీ వీరికి దేశంలో అనుయాయులేర్పడినారు. వీరి రచనలో కొన్ని అత్యుత్తమ శ్రేణికి చెందినవని ఒప్పుకొని తీరాలి.
నూతన గేయరచనోద్యమాన్ని బయలుదేరదీసి దానికి నాయకుడైనవాడు శ్రీ.శ్రీ. 'అల్లకల్లోలమైన సుడిగుండంలా' ఈ కవి 'ఒక్కడే అనేకమంది యువకులను తనలోకి లాక్కుంటున్నాడు.' 'ఈ సుడిగుండంలో పడి' వ్యక్తిత్వం గల యువక హృదయాలు 'ఉక్కిరిబిక్కిరై' పోతున్నవి.
కాని ఉద్యమనాయకుడెప్పుడూ ఋజుమార్గంలోనే ఉంటాడు. తన పూర్వులకు శైలీసౌలభ్యంలో సన్నిహితుడుగా ఉంటాడు. వారి ననుసరించే వారు చిత్రచిత్రాలు చేసి చివరకు ఒకప్పుడు అయోమయంలో పడిపోవటానికి అవకాశం కలుగుతుంది.
విశ్వ శ్రేయస్సు కోరి, పరిస్థితులు మారటానికి విప్లవము సాధనగా నమ్మి, దేశాన్ని ప్రబోధిస్తూ ప్రపంచంలో ఘోరహత్యలు జరిగినవీ, జరుగుతున్నవీ, కళ్ళకు కట్టేటట్లు ఆవేశపూరిత హృదయంతో కవిత్వం చెప్పాడు శ్రీ.శ్రీ.
'అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి
జగమంతా బలివితర్ది'
నరజాతికి పరివర్తన - అనేది ఆయన నిశ్చయ లక్ష్యం ఇంత ఘాటైన కవితావేశం గల కవి తెలుగు నేలమీద ఎన్నడూ పుట్టలేదనే చెప్పాలి.
'ఉండాలోయ్ కవితావేశం
కావాలోయ్ రసనిర్దేశం
దొరకదటోయ్ శోభావేశం
కళ్ళుంటే చూసే
వాక్కుంటే వ్రాసే
ప్రపంచ మొక పద్మవ్యూహం
కవిత్వ మొక తీరనిదాహం -
అని అంటాడీ కవి.
498
వావిలాల సోమయాజులు సాహిత్యం-4