కారణం చేత యువతులు లేచి వచ్చినా వాళ్ళ విషయం మన్ననకోసం ఇతరుల చెవిలో వేస్తుంటారు కొంతమంది. వాళ్ళే గాలిపిల్లలు, మబ్బుకన్నెలు. పతివ్రతలని కూడా భావించకుండా, గొడ్డు ఈనిందంటే గాట కట్టేయమనే రకం వాళ్ళు. వాళ్ళను పొందాలనే వాంఛతో ప్రయత్నాలను చేసే ప్రజలున్నారు. లోకంలో అటువంటివాడే సముద్రుడు. ఇంట్లోనుంచి ఈ కారణం వల్ల లేచి వచ్చిన వాళ్ళను పొగిడేవాళ్ళూ లోకంలో ఉన్నారు. వారే భూదేవత, పికిలిపిట్ట, కోకిల ప్రభృతులు. వారిని ఆదరించే గోదావరీ తల్లి లాంటి పుణ్యవనితలు కూడా ఉన్నారు. ప్రపంచంలో ఇదంతా విశ్వనాథ కిన్నెరసాని పాటలో చూపించిన మనస్తత్వము (Psychology). అన్య సంపర్కాలను ఆహ్వానించి, జాతిధర్మాన్ని నాశనం చేసేవారిని దేశం ఎంతోకాలం ఆదరించదనే “కోకిలమ్మ పెండ్లి" లోని సామాన్య సిద్ధాంతమైనట్లు స్ఫురిస్తుంది.
వీరి భాష రసస్ఫూర్తిని బట్టి రకరకాలుగా పర్వెత్తుతుంది. గేయరచనలలో వీరు అనేక కొత్త నడకలు చూపించారు. అక్కడక్కడా శ్రుతికటువైన శబ్ద ప్రయోగం కనిపిస్తుంది. దానికి ప్రత్యేకమైన కారణాలేమన్నా ఉన్నవేమో!
ఈ యుగంలో యెంకిపాటలు వంటి పాటలు వస్తే రావచ్చు కాని కిన్నెరసాని వంటి పాటలు మాత్రం ఆ కవి నోట తప్ప, రావని నా మూఢవిశ్వాసం. నిరీక్షిద్దాము.
"సాహిత్య ప్రపంచంలో కొత్తరీతులకు దోవ చూపించింది, కొత్త రుచులు ఎరిగించింది, కవితాకన్యను మనోహరంగా, చూడ ముచ్చటగా అలంకరించింది. ఆమెకు క్రొత్త పోకడలు నేర్పింది నవకవులందరిలోకీ తొలుదొల్త శ్రీ శివశంకర శాస్త్రిగారే. ఆయన చూపని సులభోపాయం లేదు. కావ్యరచనావిధానానికి, అవుననక పోయినా అనుకరించని ఆధునికులూ లేరు" (రామకృష్ణ శాస్త్రి - కృష్ణాపత్రిక) శివ శంకర శాస్త్రి సంప్రదాయం చెడకుండా గేయకవితాకన్యకు ఎన్నో నూతనాలంకారాలు చేశాడు. అంతకుముందు తెలుగుకవికి తెలియని గీతికాస్వగతాలు, గీతినాట్యాలు, గీతికాసంవాదాలు, గేయ నాటికలు తెనుగులోకి తెచ్చాడు. ఈ రచనావిధానమే ఆయన విశిష్టత. నడకల్లో నానారూపాలు చూపించి ప్రసన్నతాగుణానికి తిరిగీ ప్రాణం పోసి గేయరచనలు చేస్తాడీ కవి.
ప్రణయ చిహ్నంగా ప్రేయసీదత్తమై వాడిపోయిన వకుళమాలిక ముఖతః ప్రేయసీ హృదయాంతరాళాలను విప్పి చెప్పి, ఆత్మ పరిశీలన చేసుకొని చూపించాడు. అద్భుత సంఘటనలు, అమరగానము అన్ని మూలలా కావ్యంలో కళ్ళకు కనిపిస్తవి. చెవికి వినబడుతుంది. భావనాప్రపంచం నిజమని నమ్మించే శక్తి ఈయనలో పరసీమ
496
వావిలాల సోమయాజులు సాహిత్యం-4