Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చక్కని పదములు, కూర్పు అంటే కృష్ణశాస్త్రికి అపరిమితానందము. అది ఆయనలోని ఉపజ్ఞ. ఏ గేయమైనా తీర్చి దిద్దిన శిల్పఖండంలా, చెక్కుచెదరని దివ్యవనితలా మోహపెడుతుంది. కవితాశిల్ప ప్రధానమైన గేయాలకు ఈయనను చెప్పి చెప్పాలి. శబ్ద ప్రయోగము పట్టు ననుసరించి ఉంటుంది. కూర్పులో ఒక తడవ “పైదలి కుత్తుకలోని పల్లటీకూతలు”, ఇంకోమారు “ప్రళయకాల మహోగ్ర భయదజీమూతోరుగళ ఘోరగంభీర ఫెళ ఫెళార్భటులు" వినిపిస్తవి. "కవి తన హృదయావేశాలకు బద్ధసభ్యుడు కావాలే గాని ప్రజాభికాంక్షకు పట్టుపడ కూడ”దనే రవీంద్రుని మతంలో వాడుగా కనిపిస్తాడీ కవి.

"Poets have to be true to their best moments and not to the people's requirements.

ఈ విషయమే కృష్ణశాస్త్రి 'స్వేచ్ఛ' అనే గేయంలో

“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు ?
నా ఇచ్చయే గాక నాకేటి వెరపు?”

అని వాడుకున్నాడు.

ప్రేయసివైపు హృదయం ప్రవహిస్తే ప్రేమగీతాలు, పరమేశ్వరుని పాదసాన్నిధ్యంలో భక్తిగీతాలు, భారతజనయిత్రి సుందర ప్రశాంతరూపం కళ్ళకు కట్టినప్పుడు జాతీయగీతాలు, 'ఆకలి' వేసినప్పుడు అకలి పాటలు అల్లుకున్నాడు, పాడాడు, కురిశాడు, అందించాడు, ఉన్నట్లుండి ఉబుసు పోనప్పుడు ఊహాగీతికలు (Fancy Songs) వ్రాశాడు. ఆయనలో కలిగిన అన్ని సంస్కారాలనూ అన్ని రకాల గీతాలలో పెట్టాడు.

ప్రేమ గీతాలలో ఎక్కువగా ఉన్మాదావస్థ కనిపిస్తుంది. "అతడు నా వలెనే ఉన్మత్త భావశాలి" అనే వాక్యంలో ఈ విషయం ఆయననే చెప్పుకున్నాడు. పిచ్చివాడు, ప్రియుడు, కవిభావనాసౌధం మీద ఒకే అంతస్తులో ఉంటారు.

"The lunatic, the lover and the poet and all in imagination compact” అనే సిద్ధాంతానికి కృష్ణశాస్త్రి ప్రియుడుగాను, కవిగాను, స్వచ్ఛమైన తార్కాణము.

ఏకేశ్వరోపాసకుడైన ఈ కవి భగవంతుని పాదసన్నిధికి ప్రేయసిగాను, ప్రియపుత్రుడుగాను, ప్రియసేవకుడుగానూ చేరుకుంటాడు. మధుర, వాత్సల్య, దాస్యభావాలు స్థూలదృష్టికి భక్తిగేయాలలో కనిపిస్తవి. అహం గ్రహసంబంధమైన


494

వావిలాల సోమయాజులు సాహిత్యం-4