Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నప్పటి అమాయకత్వము. "ఎన్నాళ్ళో మనకోలె ఈ సుకము” అన్నప్పటి బేలతనము., కడుపులో చెయ్యేసి కలచే ఆమె చేష్టలు, మాటలూ రసికలోకం ఎలా మరచిపోవటం! ఆలోచించినకొద్దీ యెంకిలో ఎన్నో అందాలు బయటపడతవి. ఆ పాత్ర తరిగిపోని అమృతకలశము. ఎన్ని 'గాలిదుమారాలు' రేగినా, ఏ కోశానా చెక్కు చెదరలేదు, చెదరదు, చెదరబోదు.!

కావ్య శిల్ప గీతికలను, జానపద గీతాలను రెంటినీ కవితాదృష్టితో వీక్షించి, సమాన గౌరవం చూపి గేయరచన చేసిన కవి అడివి బాపిరాజు. నండూరి అభినయించిన జానపదజీవితంతో సారూప్యాన్ని పొంది పదకవితలు పలికాడు. గ్రామీణుల వివిధ జీవిత సంఘటనలను, వారి పదఫణితిలో పాడుకున్నాడు. నాయుడు బావ, ఎంకి, కవిలోని భావపారిశుద్ధ్యరసావేశాలలో ప్రభవించారు. బాపిరాజు స్వయంగా జానపదుడై సూటిగా బోళాతనంతో పఠితను తన వశం చేసుకుంటాడు. ఇక్కడ బుద్ధిని రంజింపజేసే తళుకుబెళుకులకు, నగిషీలకూ స్థానం లేదు. పుష్కలమైన జీవిత సుఖదుఃఖాలలో నుంచీ పొంగి పొరలే హృదయావేశం ఒక్కటే స్ఫురిస్తుంది.

ఈయన పల్లెపట్టు దాటి కావ్యాల్లోనికి అధిగమించి ఒక స్వాప్నికత్వాన్ని మనగేయ సారస్వతంలోకి పట్టుకొచ్చాడు. ఆమెను "శశికళ"గా రూపించి మన ఎదుట ప్రదర్శిస్తున్నాడు - శశికళ సౌందర్య బాలిక. ఆమెను గురించి కవే అన్నమాటలివి. “శశికళ” నాకు సత్త్వం, ఆమె నా ప్రేమ విధానము. నా గొంతుకలో బయలుదేరిన సన్నని రాగం గానీ, నా కళ్ళలో ప్రతిఫలించిన రంగుల చిత్రం గానీ ఆమె విలాసాలే. ఆమె నాకు తోచని క్షణాలు భయంకర ప్రదర్శనమే. కాలగర్భంలో నుంచి బయలుదేరిన మరుక్షణం నుండీ నా చేయి ఆమె, ఆమె చేయి నేనూ పట్టుకొని నడుస్తున్నాము. ఈ యాత్ర కాలాన్ని దాటిన ఆనందం వరకూ, ఆనందమే మాకు దారి. ఆనందమే గమ్యము.” వస్తుతః దివ్యశిల్పి కావటం చేత ఆయన శశికళ పాటలలో రేఖాకార చిత్రలేఖనపు నగిషీలు కనబడతవి. "ప్రతి వాక్యమూ చిన్న బొమ్మలా నయనాలయందు నర్తిస్తుంది.” ఇది ఆయన ప్రత్యేకత. దివ్యపథాలలో ఈ కవితో యాత్రలు సలిపే పవిత్ర నవ్య సాహితీ మూర్తులు, Dante, Rosette మొదలైన పాశ్చాత్య రచయితలు కవికి ఈ సౌందర్య బాలికాసాహచర్యంలో తోడు.

సంగీతానికి మొదట సుశరీరం, సుశబ్దం కావాలి. “కవిత్వమునకు కావలసినది భావనాస్ఫోరకత్వము (Suggestiveness), హృదయాకర్షణము, రసోజ్జృంభణము ఛందోబద్ధమగు మనోహర శబ్దసముదాయము” (కృష్ణశాస్త్రి - ఏకాంతసేవ పీఠిక)


సాహిత్య విమర్శ

493