Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పండితులు ఠారెత్తి
పరుగుచ్చుకోవాలి”

అని పాండితీబంధనాలకు స్వస్తి చెప్పే సాహసము, ఆత్మశక్తిని గుర్తించిన స్వాభిమానమూ ఈ కవికి మొదటినుంచీ పట్టుబడ్డవి. ఆత్మానుభవాలను కొద్దిపాటి కల్పనతో పాటలుగా కూర్చి పఠితలను పరవశులను చేశాడు. రసమయమైన అనేక జీవిత ఘట్టాలే ముఖ్యమైన వస్తువు. వైవిధ్యము, దానికి తోడు దివ్యమైన కవితావేశము, సహజమైన పవిత్రభావన, ఉన్నతాశయాలు, స్వచ్ఛసంప్రదాయము, నగ్న సౌందర్యము, నిరాడంబర కవితాశిల్పము, వీరి గేయకవితా సుందరికి పెట్టని అలంకారాలు. ఆమె “చిన్నతనం నుంచీ రాగిణి. భావనోద్దీపిత, గానలోల." శ్రోతలను ఒకచోట నవ్విస్తుంది. ఒకచోట నాట్యం చేయిస్తుంది. ఒకచోట కన్నీరు కార్చేటట్లు చేస్తుంది. ఒకచోట భయపెడుతుంది. చివరకు అభయమిస్తుంది. మనోహరమైన మహోన్నతభావాలను జీవద్భాషలో పెట్టి చేతికందించే శక్తి ఈ ఒక్కడి సొమ్మే. తికమకలు తక్కువ. పఠితలను పట్టిచూడటం కాదు ఆయన పద్ధతి; హృదయానికి నాటేటట్లు చెప్పడం. “వాగీశుడే వచ్చి దాసోహమని పాట వ్రాసి వల్లించాలి" అని ఆయన చెప్పిన ముక్కలో ఉన్న సత్యం ఈ కారణం వల్ల కలిగిందే!

గీతికా రచనకు తత్త్వ, ఓఘ, ఘనాలతో పరిచితి అత్యవసరము. నృత్య వాద్యాలతో కలిపి పాడినప్పుడు తౌర్యత్రికసిద్ధి కలిగి ఆయన పాటల్లో పట్టు తెలుస్తుంది. బసవరాజు సతతసౌందర్యోపాసి, పిపాసి, చిన్న చిన్న వస్తువులలో చిన్మయమూర్తిని చూచి చూపించే శక్తి కలవాడు. ఆశాభంగాలు కలగటం వల్ల అంతరంగవేదనాక్షుభితమై పాటగా అప్పుడప్పుడూ మోగినా, దాన్నే అంటిపెట్టుకొని కూర్చోడు. కష్టసుఖాలను రెంటినీ సమదృష్టితో చూడమనే అద్వైతి. 'బ్రతుకే చేదని అంటావే బ్రతికెదరేలా దేవతలూ?' అని ఆయన ప్రశ్న. దుఃఖమయ ప్రపంచాన్ని సంతోష సాగరంగా మార్చుకోటానికీ వీలున్నదనే భావుకుడు.

భక్తి, ప్రేమ, దానికి ఆయన సూచించిన సాధనాలు. అస్తికుడై ఈ కవి మిథ్యావాదులను భక్తిమార్గంలో పడిపోయి జీవితంలోని అశాశ్వతత్వాన్ని పోగొట్టుకొండని దారి చూపి ప్రబోధించాడు. జిజ్ఞాసాపూర్వముగాని జనసామాన్య మత మీయనది. ఈ కవి ప్రేమతత్త్వము ధనప్రాణాదులను, స్వార్థాన్ని మించి పోయింది. ప్రేమ మృదులతను కూరుస్తుందని, కలుషాలు కడిగి వేస్తుందని, అహంకారాన్ని అణగద్రొక్కుతుందని ఆయన నమ్మకము.


సాహిత్య విమర్శ

491