పాటు సమాన గౌరవము, ఆదరాభిమానాలు సిద్ధించినవి. సంఖ్యలో అతిశయించినవి. ఆత్మానుభూతులను హృదయానికి నాటేటట్లు చెప్పటంలో పరాకాష్ఠనందుకున్నవి. ఆవేశ ప్రాధాన్యములో అందెవేసినవి. దేశానికి ఎంతో మేలు కలిగింది. సిద్ధహస్తుల విషయంలో అప్రయత్న, ఆవేశము, కవితాదీక్ష, విమల భావన, జీవిత విమర్శ, పరిశీలన, సుస్పష్ట రూపకల్పన, హృదయాకర్షణశక్తి. రసోజ్జృంభణము, ఉన్నతాశయములు, స్వచ్ఛమైన సంప్రదాయ సిద్ధి కలిగాయి. వీరు కవితాకైలాస శిఖరాలను చూపించి భావి కవులకు మార్గదర్శకులైనారు.
గేయరచనల్లో ఏర్పడ్డ లోపాలు చాలామట్టుకు దేశంలో ప్రబలిపోయిన కొన్ని నూతన సిద్ధాంతాల వల్ల కలిగినవి. కొందరి మతంలో గేయానికి ఒక విధమైన ఊపు వస్తే చాలునని. ఊపే ప్రధానంగా పెట్టుకొని రచన చేస్తే ఊపుతో చదవటానికి వీలుంటుందేమోకాని, పాడుకోటానికి వీలులేదు. గేయానికి కావలసిన ముఖ్యలక్షణాలలో ఒకటైన సంగీతానికి స్థానం తక్కువన్నమాట. వీటిని లక్షణ యుక్తమైన గేయాలనడం కన్నా, ప్రత్యేకమైన మరి ఒక ఊపు గేయ పద్దతనటం చాలా బాగుంటుంది. మరికొందరు రచయితలు కేవలము మాత్రలు సరిపోయినవా, లేదా అనే చూస్తున్నారుగాని, లయమీద దృష్టి నిలపటం లేదు. ఇది ఒక నవ్యత అని వారి సిద్ధాంతము, మాత్రలు సరిపోయినా కొన్నిచోట్ల గేయం నడవదు.
శ్రుతిమించిన భావన చేసి దానిని స్ఫురింపచేసే సంప్రదాయసిద్ధమైన పరిభాష ఉపయోగింపక, పఠితను అయోమయంలో పడవేసే గేయరచనలు అపరిమితంగా వస్తున్నవి. భావించిన రూపకల్పన సంప్రదాయానికి కట్టుబడక పోయినా, సహృదయులైన రసికుల తార్కిక దృష్టికైనా పొడకట్టాలి. అలా జరగనప్పుడు వారి భావన ఒక విధమైన ఉన్మత్తత క్రిందికి వస్తుందని క్రోషి మతము.
"All imagination beyond reason is a bit of insanity."
భావన ఎంత విచిత్రంగానైనా చేసి అనుభవించవచ్చు. "హృదయంతో అనుభవించగలిగినది అంతా మాటలతో వెల్లడి కాదు. దాని ఛాయను వెల్లడించే శక్తి కూడా మాటలకు ఉన్నదో లేదో - అందుచేత కవి తన అనుభవాన్ని స్ఫురింపజేసే పరిభాషను ఉపయోగిస్తాడు. ఆ పరిభాష సంప్రదాయసిద్ధంగా ఉంటేనే కాని, పద బంధము మాటున ఉన్న భావ ప్రపంచములోకి వెళ్ళలేము. కవి ఆ విషయములో ఎంత శ్రద్ధాళువై ఉంటే కావ్యానికి అంత శోభ వస్తుంది" (వేదుల కల్యాణకింకిణి పీఠిక). ఇది ముఖ్యముగా గమనించవలసిన లోపము.
488
వావిలాల సోమయాజులు సాహిత్యం - 4