Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికుల ప్రేమగీతాలు చాలా గొప్పవి. వారు స్త్రీని జగదంబ స్వరూపిణిగా దర్శించారు. ఆ కారణం చేత ఈ శ్రేణికి చెందిన గేయాల్లో అపవిత్రతగాని, అంగసౌష్ఠవ వర్ణనగాని కనిపించవు. ఒకవేళ వీరి దృష్టి అంగప్రత్యంగవర్ణన మీదికి పోయినా, అది శిల్పిదృష్టి. పరమేశ్వరిని చిత్రించే శిల్పి దేవి పీనవక్షోజాలను ఏ దివ్యదృక్కుతో, పవిత్రభావనతో వీక్షించి చిత్రిస్తాడో, వీరూ అదేరీతి.

ప్రకృతి పురుష స్వరూపులైన జగదేకమాత, లోకేశ్వరులిద్దరే ఆధునికుల భక్తికి అధిష్ఠానదేవతలు, నిర్గుణతత్త్వాన్ని నిరసించరుగాని సగుణమంటే సంతోషము అధికం, బహుమూర్తులను ఆరాధించినా బ్రహ్మపదార్థం ఒకటేనని వీరి విశ్వాసం. ముముక్షుమార్గానికి భక్తులు అవలంబించే పంచభావాలలో దాస్య, వాత్సల్య మధురాల మీద మక్కువ. వెతికితే శాంతం కూడా అక్కడక్కడ కనిపించకపోదు. ద్వైతాద్వైతాది జిజ్ఞాసలలోకి దిగరు. ఇది నేటి ఆధ్యాత్మిక భక్తిగీతాలలోని విషయము. రచనా నాస్తికమత ప్రబోధం చేసే గేయాలు కూడా ఒకటి రెండు వచ్చాయి. వాటికి సమాధానాలు కూడా గేయరూపాలే ధరించాయి.

చిన్నపిల్లల విజ్ఞానానందాల కోసం ప్రస్తుతము అన్ని దేశాలలో కవులు గేయాలు చెపుతున్నారు. నిజంగా కవిని పట్టిచూస్తే రచనలు బాలబాలికల అనుభవాలలోను, చేష్టలలోను, ముఖ్యంగా వాళ్ళ భాషలోను కవి సుపరిచితుడు కావాలి. వాళ్ళ చిలిపి చేష్టలను చూచి కవి తాను గూడా పిల్లవాడై ఆనందించి అప్రయత్నంగా వాళ్ళ నోటివెంట వచ్చే భావాలకు ఉప్పొంగి, వాళ్ళ ఆటపాటలు పరిశీలించి, వాళ్ళ మానసిక తత్త్వ నిరూపణ చేసికొని గాని అతడు వాళ్ళకోసం పాటలు వ్రాయగూడదు. ఆ శక్తి లేనివాళ్ళు వ్రాస్తే రసికలోకానికి రక్తి కడితే కట్టవచ్చుగాని, పిల్లలకు నిరుపయోగం. కవి పోయి చెప్పకుండానే వాళ్ళు తెలుసుకొని ఆనందించే టంత అందుబాటులో ఉండాలి. మనలో ఆ ప్రయత్నం చేసే కవులు ఇద్దరో ముగ్గురో తప్ప లేరు. వ్రాయటము మట్టుకు చాలామంది వ్రాస్తున్నారు. ఈ రచనలు చాలా భాగం గంభీర భావాలతోను, అల్లిక జిగిబిగువులతోను, ఛందోరహితంగాను ఉన్నవి. వస్తువును బాలబాలికల దృష్టితో వీక్షించక పోవడము వల్ల ఏర్పడే లోపం వీటిలో ఎక్కువ. బాలగేయాలకు ప్రత్యేకంగా లయ అత్యవసరము. నడక సాధ్యమైనంతవరకు సాఫీగా ఉండటము మంచిది. లేకపోతే పిల్లలు తికమక పడతారు. ఇటువంటివి పారంపర్యంగా వచ్చే పాటలు ఆంధ్రదేశంలో అన్ని మూలలా దొరుకుతవి. వాటిలో మట్లు ఆదర్శపాత్రమైనవి. అనుకరణ యోగ్యాలు. కొత్త మట్లు కనిపెట్టవద్దని కాదు. అప్పుడు కూడా పాతమట్లను దృక్పథంలో


486

వావిలాల సోమయాజులు సాహిత్యం-4