Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

- Songs), బాలగేయాలు (Children's Songs), ప్రచార గీతాలు (Songs of propaganda), విప్లవ గీతాలు (Revolutionary Songs).

కథాగమన గీతాలు ఒకటో రెండో తప్ప లేవు. ఉన్న వాటిలో కూడా కథాకాలం నాటి సాంఘికాది పరిస్థితులకు స్థానం తక్కువ. చరిత్రాత్మకమైన పాత్రల పేర్లు వున్నంతమాత్రాన అది చరిత్రాత్మక కథాగమన గీతిక కాదు. గేయాలలో కూడా తక్కిన ఇతర కావ్యాలలో మాదిరిగానే దేశకాల పరిస్థితులు, ఆచార వ్యవహారాలు ప్రతిఫలించాలి. గీతినాటికారచనలకు ప్రయత్నించే కవులు మనలో అరుదు. దానికి ఎంతో వ్యుత్పత్తి కావాలి. "నాటకాంతం హి సాహిత్యమ్" అని ప్రాచీనులు నాటక విషయంలో అన్నారు. “న తత్ శ్రుతం న తత్ శిల్పం, న సా విద్యా న సా కళా, నాసౌ యోగో న తత్ కర్మయ న్నాట్యే౽ స్మిన్న దృశ్యతే" అని భరతుడు. కేవలం నాటక విషయమే ఈ విధంగా ఉంటే దానిని ఛందోబద్దము చేయటానికి ఇంకా ఎంత ప్రజ్ఞ కావాలో ఆలోచించండి. కేవలం ఆత్మానుభూతులను వచ్చినది వచ్చినట్లుగా అభివర్ణించాలనే మతము పోయే అంతవరకూ ఈ కావ్యపద్ధతికి (Poetic form) ముక్తి రాదు.

గ్రీసుదేశంలో మొదట కవులు తమ కష్టసుఖాలకు తాము గోపాలకులై, అనుభూతి గోపాలక ప్రపంచానికి సంభవించినట్లుగా భావించి కావ్యరచనలు చేశారు. వాటినే గోగీతిక (Pastoral Songs) లనే వాళ్ళు. తరువాత తరువాత అవి అన్నిదేశాల సాహిత్యాలలోకీ ప్రాకిపోయినవి. మన ఆధునికులూ అటువంటి రచనలు కొన్ని చేశారు. కానీ వాటికింకా ఆంగ్ల సారస్వతంలో ఉన్న గోగీతికలకు కలిగినంత ప్రత్యేకత రాలేదు. జాతీయ గీతికలు ఆధునిక సాహిత్యంలో బహుముఖముగా వికసించినవి. కానీ వాటిలో ఎక్కువ భాగము పాడుకోవడానికి నిరుపయోగంగా కనిపిస్తున్నవి. విమలభావనతో, జాతీయ జీవనాన్ని ఒలక బోసుకుంటూ హృదయవీథులలో విహరించే శక్తి వేళ్ళమీద లెక్కపెట్టదగ్గ ఏ కొన్నిటికో మాత్రమే ఉన్నది. వీటిలో కొన్ని సంకుచిత జాతీయభావాన్ని ప్రదర్శిస్తున్నవి. భారతదేశమంతా నాదనుకున్న జాతీయగీతికాకర్తలు తక్కువ. ఆంధ్రాభిమానం ఉండటం తప్పు కాదు. కానీ అది భారతదేశాభిమానాన్ని ధిక్కరించేదిగా ఉండకూడదు. 'భారత (చీ) కాదు ఆంధ్ర మాతకు జై' అన్న “శ్రీ" గీతాన్ని చదివినప్పుడు విశాల జాతీయదృష్టి గల పరితకు ఏయే భావాలుత్పన్న మౌతనో ఆలోచించండి.

ఆత్మగీతాలు తరువాతివి. నేటి రచయితలలో ఇవి బహుళము. కవుల కష్టసుఖాదులు వీటికి వస్తువు. స్వానుభవాలు కాబట్టి, ఆవేశ పూరితమైన హృదయము, అప్రయత్నత (Inevitability) వీనిలో పరాం కోటికి చేరాయి.


సాహిత్య విమర్శ

485