Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాషాంతరీకరణము చదివిన ఇతర సాహిత్యవేత్తలు, త్యాగయ్యను మనము కవిగా పరిగణింపకపోతే రమ్యావలోకన చేయలేమని నిరసిస్తారన్నమాట మన వాళ్ళింకా గ్రహించలేదు. ఇతనిని అరవవారికి అరణమిచ్చామే, ఎల్లా తీసుకుందామా అని సంశయిస్తున్నారా?

జావళీలన్నీ శృంగార రసప్రధానమైన పదసారస్వతం క్రిందికి వస్తాయి.

'రేపు వత్తువుగాని తూరుపు తెల్లవారెపోరా ఈ వేళకు' అనే జావళి

'చెరగుమాసె ఏమి సేతురా,
దరిజేరగనైన వీలుకాదురా’

అనే జావళీ సంభోగ శృంగారాన్ని సూచిస్తున్నా వాటి కూర్పులో గొప్పదనం, భావనలో ఔచితీ కనిపిస్తవి.

పదసంయోజనంలోను, భావవైఖరిలోనూ, విన్యాసక్రమంలోనూ తనతో ఏ పదకర్తా పోలలేకుండా పదకృతులు చేసిన క్షేత్రయ్యలో, నవీనులు అందుకోలేని రమ్యత కనిపిస్తుంది. శృంగారనాయికలు ఎన్నెన్ని రకాలో అన్ని రకాల పదాలు మువ్వగోపాలుని మీద రచించాడు. ఏ పదము తీసినా ఆధునిక భావచైతన్యము స్ఫురిస్తుంది.

ఉదాహృతి

మగువ ఏకాంతమందిరము వెడలెన్
నగకాడ, మా కంచివరద! తెల్లవారె ననుచు

॥ మగువ ॥

విడగారు గొజ్జంగి విరిదండ జడతోను
కడుచిక్కుబడి పెనగు కంఠసరితోను
నిడుదకన్నులదేరు నిడుదమబ్బులతోను
తొడరి పదయుగమున దడబడెడు నడతోను

॥ మగువ ॥

సొగసి సొలయని యలవు సొలపు జూపులతోను
వగవగల ఘనసారవాసనలతోను
జిగి మించు కెమ్మోవి చిగురు కెంపులతోను
సగము కుచముల విదియ చందురులతోను

॥ మగువ ॥


సాహిత్య విమర్శ

481