Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అస్సని నేనొక్క పోటేసితేను
ఆకసము తల్లడిల్లు ఆరాము గదలు”

అని పాడుతూ ఉంటారు.

పాములవాడు కాటుకు మందు వేయబోతూ-

'దిగు దిగు నాగన్న, దివ్యసుందరనాగ!
నిండుపున్నమనాడు పండు వెన్నెల గాచు
స్వల్ప గ్రహణం నాడు చందమామను మ్రింగు
దిగు దిగునాగన్న దివ్యసుందర నాగ!
దిగకున్న మంత్రాన దింపించుతానురా
నాగ దిగురా నాగన్న దిగరా నాగా దిగర'

అని పదంపాడి ఏదో మూలిక వేసి సర్పదష్టుడైన సామాన్యజీవికి ప్రాణం పోసి పంపిచేస్తాడు. ఇటువంటి జానపదసారస్వతాన్నంతటనీ సేకరించి గ్రంథస్థం చేయటము ఆంధ్రుల కర్తవ్యము.

మతవేదాంత భక్తి రచనలు లెక్కకు మీరి మన భాషలో ఉన్నవి. మన దేశపు మత విపరిణామ చరిత్రకు పట్టుకొమ్మలు అవే. వీరశైవమత విజృంభణ కాలంలో

“శివ శివ యన మేలు తుమ్మెదా - శివ
యంటేను వినమేలు తుమ్మెదా
శరణన్న మేలె ఓ తుమ్మెదా
శ్రీకంఠుడును పువ్వు తుమ్మెదా
మూడులోకము లాయెనే తుమ్మెదా -
పరమైకాంతమును జూడు తుమ్మెదా”

అనే పదం పాడేవారు భక్తులు. ఈ తుమ్మెదపదంలో అన్యాపదేశము, వ్యంగ్యత మూర్తీభవించాయి. సాధారణంగా వేదాంతపదకర్తల రచనాధోరణి ఇదేవిధంగా ఉంటుంది.

ఆంధ్రజ్ఞానులలో ప్రత్యేక వ్యక్తిత్వం కలవాడు వేమన. తత్త్వోపదేశం జాను తెనుగులో నూరిపోసి మధుర కవులలో తన పేరుకు చిరస్థాయిత్వం కల్పించుకున్నాడు. ఆ నాటి మతాచారాలతోను, వేదాంత మార్గంతోను విసుగు జెంది,


478

వావిలాల సోమయాజులు సాహిత్యం-4