Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'రావి చెట్టెక్కేవు రాగాలు తీసేవు
రాలి పోతవు గండుకొడుకో రెంకయ్య'

అన్నప్పుడు ఆమె హృదయారాటము బహిర్గత మౌతున్నవి. ప్రియునితో సరస సల్లాపాలకు ఏకాంత ప్రదేశం అభిలషిస్తూ ఒక పల్లెపడుచు,

“సముద్రాలు దాటి పోతే
సక్కనైనా తోపులుండై
సల్లగా ఆ చెట్టు నీడల
సరస మాడుదమా! మామా
తాలి పోవుదమా?”

అని అంటుంది. ప్రబంధ నాయికానాయకులకు వంద పద్యాల వర్ణన పట్టే వనం ఉంటేగాని సల్లాపాలు సాగవు. 'చల్ మోహనరంగా' పాట గూడా నవరసోపేతమైన ప్రణయగాథ. పదవాఙ్మయములో ఆ పాట విని ఏ రసజ్ఞుడు ముగ్ధుఁడై పోడు?

కరుణప్రధానాలైన కమ్మని పదాలు భిక్షుకుల నోట్లో తాండవిస్తూ ఉన్నాయి. ముష్టిమనిషి చంకన జోలెలో పసిపిల్లను వేసుకొని ఇంటింటిదగ్గరా

"జోడుకొండల నడుమ నినుగంటి తండ్రి
ఏడువకు ఏడువకు వెర్రి అబ్బాయి
ఏడిస్తె నిన్నెవరు ఎత్తుకుంటారు?
చెట్లే చుట్టాలు మరి రాళ్లె దేవుళ్ళు”

అని పాడుకుంటూ తన జీవనాధారం చూసుకుంటుంది. అది పాడేటంత సేపూ మనకు వనాంతరాల్లో వనితామణి సీత పసిపిల్లవాణ్ణి సముదాయించలేక పడే పాట్లు జ్ఞప్తికి వస్తాయి.

ఏదో ఒక పదం పాడుతూ పనిచేసుకోవటము పల్లెవాసులకు పరమానందం. దంపుతూ ఉంటే చూచాను.

“సువ్వని నేనొక్క పోటేసితేను
చుక్కల్లు పిక్కటిలు సూరన్న కదలు


సాహిత్య విమర్శ

477