Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కందుకూరి రుద్రయ్య, గోగులపాటి కూర్మనాథకవి, ఆలూరి కుప్పన మొదలైన పండిత కవులు, జంకు లేకుండా ప్రజాసాహిత్యాభివృద్ధికి ప్రౌఢయక్షగాన కృతులు రచించి పేరుతెచ్చుకున్నారు.

ఇరవయ్యో శతాబ్ది ప్రథమదశలో గేయరచనలకు గౌరవం తగ్గింది. ఇప్పుడిప్పుడే ఆధునికుల అపార శ్రమ, అప్రతిమాన ప్రతిభ వల్ల ప్రతిష్ఠ సుస్థిరమైనది.

మన ప్రాచీన గేయవాఙ్మయాన్నంతా కొన్ని ముఖ్యశాఖలుగా విభజనలు చేయవచ్చు.

అవి జానపదుల పదకవిత, మతవేదాంత భక్తి రచనలు, జావళీలు, స్త్రీల సారస్వతము.

జానపదుల పదకవిత : కర్షక గీతాలు, దంపుళ్ళ పాటలు, బండిపాటలు, పడవపదాలు, పల్లీజన ప్రేమగీతాలు, జంగం పాటలు, ఏలపదములు, చందమామ పదములు, నూరుపుళ్ళ పాటలు, మొదలైనవన్నీ జానపద వాఙ్మయం క్రిందికే వస్తవి. స్వచ్ఛందభావము, నిరలంకారత, సమాజకవితాపటిమ, జాతీయత, రసపుష్టి వీటిలో ఉన్నంతగా నాగరిక కవితలో కనుపించదు.

ఏరుమీద ఆధారపడే కర్షకులకు ఏరువాక ఒక వరవడిదినం ఆబాలగోపాలము ఆనందంలో పొంగిపోతారు. నూతన పరికరాలను సేకరించుకొని ఏరు ఎప్పుడు వస్తుందా ఎదవేద్దామని కాచుకొని, స్వాతివానకు ముత్యపుచిప్పలలాగా నోరు తెరచుకొని కూర్చున్న రైతులకు, ఏరు రాగానే హృదయం పొంగి సహజకవిత ఉద్భవిస్తుంది. ఏమని

'ఏరు వాకొచ్చింది ఏరు వాకమ్మ
ఏళ్ళు నదులూ పొంగి వెంబడే వచ్చాయి
నల్లమేఘాలలో నాట్యమాడింది
కొండ గుట్టలమీద కులుకులాడింది
ఇసుక నదిలో దూరి బుసలు కొట్టింది
పాడుతూ కోయిలా పరువులెత్తింది
ఆడుతూ నెమిలి అలసిపోయింది
నవ్వుతూ మా అయ్య బువ్వతిన్నాడు' అని.


సాహిత్య విమర్శ

475