Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగిన రసవంతమైన కవిత ఉన్నదా అంటే అది పద వాఙ్మయములోనే ఉన్నదని నా అభిప్రాయము.

శ్రీనాథునికి అంటగట్టబడ్డ అపవాదాన్ని ఆధారం చేసుకొని ప్రతివ్యక్తీ పదకర్తలను, కృతులను నిందించటానికి సాహసిస్తారు. విదేశీయ సాహితిలో అభివృద్ధి నొందినట్లు పదవాఙ్మయం అందువల్లనే మన సాహిత్యంలో ప్రవర్ధమానం కాలేదు. ఉన్నదాని మీద ఆదరము శూన్యముగా ఉన్నది. సంస్కృత భాషలో కృష్ణకర్ణామృతము, భజగోవింద శ్లోకాలు, అష్టపదులు అనుభవించే ఆదర్శపూజ్యత ఆంధ్రంలో ఒక గేయకృతికైనా లేదు. వంగభాషలో చండీదాసు, విద్యాపతి, రామమణి, గోవిందదాసు మొదలైన పదకర్తలను మహాకవులుగా పరిగణిస్తారు. హిందీ భాషలోని నూరు పదావళీ కబీరు కీర్తనలకు ఆదర్శపూజ్యత. తుకారాం, మీరాబాయి మొదలైన కృతికర్తల మహారాష్ట్ర అభంగాదులకు అత్యంత ప్రతిష్ఠ. ప్రపంచ విఖ్యాతిని చూరగొన్న రవీంద్రుని రచనలలో ముప్పాతికవంతు పదాలే.

సంతోషం కలిగినప్పుడు ప్రథమ మానవుడు చిందులు వేస్తూ కూనరాగా లాపనముతో సామాన్య పదకవిత్వము ప్రారంభిస్తాడు గాని, సంస్కృతపదభూయిష్ఠమైన పద్యకవిత్వం మొదలు పెట్టడు. అందువల్లనే సాహిత్యవేత్తలు పద్యంకన్నా పదమే మొదట ఏ సారస్వతంలోనైనా ఉద్భవిస్తుందనటంలో ఏకీభవించారు. అదే విధిగా మన భాషలోనూ ప్రథమంలో పదసాహిత్యము జన్మించి ఉంటుంది. ఆదిగ్రంథమైన భారతానికి పూర్వం పుట్టిన గేయకృతులన్నీ, పాండితీప్రభ సాగే రోజులో రూపుమాసి పోతూ జనసామాన్య గౌరవం పొందుతూ, భిక్షుక గీతాల్లోను, భక్తుల గేయాల్లోను, స్త్రీల సారస్వతములోను, సాములయ్యల గరిడీలలోను, తమ ప్రాణము నిలుపుకొంటూ వచ్చినవి. కాని పదఛందస్సులైన 'తరువోజ', 'మధ్యాక్కరలు' ప్రథమ కావ్యంతో పరిచయము కలిగించుకోగలిగినవి.

ఒక శతాబ్ద కాలము మళ్ళా పదవాఙ్మయ చరిత్ర అజ్ఞాతంగా ఉన్నది. ఇంతలో వీర శైవమత విజృంభణము దక్షిణాపథాన్నంతా కలవరపరచినది. దాక్షిణాత్య భాష లన్నిటిలోను ముఖ్యంగా కన్నడ, తెలుగు సారస్వతాలలో దేశీయ కవిత్వము మొదలు పెడుతుంది. మత ప్రాబల్యానికి సామాన్య భాషలో గ్రంథరచనము అవసరమని ఆ నాటి మత ప్రవక్తలు గుర్తించారు, ఈ మత ప్రాబల్య ఫలితాలే పాల్కుర్కి సోమనాథుని 'పండితారాధ్య చరిత్ర', 'బసవపురాణ' ద్విపదలు. ఈ శతాబ్దిలో పదవాఙ్మయము పండిత పామర జనానుమోదమైన పలుకుబడి సంపాదించుకున్నది. అందువల్లనే


సాహిత్య విమర్శ

471