Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గేయరచనలు : ప్రాచీనులు - ఆధునికులు

నారాయణ భగవంతమ్
శివ
నారాయణ భగవంతమ్
గోసాయిల మాట
గొడ్డటి దెబ్బ
సాదుల మాట
సర్పము కాటు
నారాయణ భగవంతమ్
శివ
నారాయణ భగవంతమ్

భిక్షుక గీతం ఏది విన్నా, నాలుగేళ్ళనాడు నాగవరంలో నిద్ర లేచేటప్పటికి తన చేతులలో ఉన్న తాంబూరా మీటుతూ ధ్రువాగీతిలో బావాజీ పాడిన ఈ పాట మనస్సులో ప్రత్యక్షమవటం పరిపాటి ఐపోయింది. అంతకుముందు పాటలు, పదాలు విన్నాను. కానీ, నాకు ఆనాటినుంచే గేయసారస్వతం మీద గౌరవం, ఆదరాభిమానాలు, కృషిచేతామన్న అభిలాష పొడచూపినవి.

ఏ సాహిత్యంలోనైనా శ్రోతను గాని, పరితనుగాని రస ప్రపంచయాత్ర చేయగలిగించేవి గేయరచనలే. రసికులను రంజింపజేయటానికి రమ్యమైన పదరచన ఉపయోగించినట్లు రసవంతమైనా పద్యం ఉపకరించదు. అవి లయ తాళబద్ధాలుగా ఉండి గానకళతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటమే దీనికి ప్రబల కారణము. ఒక దేశంలోని మత విపరిణామాలను, మనస్తత్వాలను, ఆచార వ్యవహారాలను, అన్యోన్య అనురాగాలను, సౌందర్య సౌభాగ్యాలను ప్రతిబింబిస్తూ దేశ జాతీయ దర్పణాలుగా ప్రవర్తిల్లడమే వీటిలో ఉన్న ఉత్కృష్టత. పరదేశీయ సాహిత్య ప్రభావం వల్ల, పాండితీ ప్రకర్షభిలాష వల్ల, ప్రౌథోక్తులవల్ల, పద్యసారస్వతము దేశీయతను, జాతీయతను విరివిగా వెల్లడించలేదు. ఆంధ్రభాషలో ఏదైనా వ్యక్తిత్వము, జాతీయత


470

వావిలాల సోమయాజులు సాహిత్యం-4