Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదములను ఝడితిస్ఫూర్తి నాసించి ప్రయోగించినారు. "దిబ్బ భడవ, గుంటడు, స్కౌండ్రలు, శుంఠలు (రసహీనులు)” వంటి తిట్లు సముచితముగ ప్రయోజితములైనవి. “నీ అమ్మకనులు మండ, గుంటడు" వంటి తిట్లు ప్రేమార్ద్రతను వెల్లడించుట యందును ఆంధ్రదేశాచారము ననుసరించి 'నా యెఱుక' లో ప్రయుక్తములయినవి.

శ్రీ దాసుగారు నైజముగ లక్షణవిరుద్ధమైన భాష నాదరింపని వారు, శిష్ట భాషాప్రియులు. సామాన్య, సంక్లిష్ట, సంయోగవాక్యములను ఆవశ్యకత లెరిగి ప్రయోగింప నేర్చినవారు. చర్చకు వచ్చినపుడు క్వార్ధకము భిన్నకర్తృకమై యుండుటకు నన్నయ పెద్దనలనుండి ప్రయోగములు చూపనేర్చిన వ్యాకరణ పాండిత్యము కలవారు. ఐనను వీరు లోకభాష నాదరించుటచే "శివకోవెల, భరద్వాజ విందు, సర్పజెముడు, యుద్ధపుంజు" వంటి వైరి సమాసములు, “ముక్కోపి” - వంటి గ్రామ్య బహువ్రీహి. “పాటకుడు” (గాయకుడను నర్థములో దేశిశబ్దముపై సంస్కృత ప్రత్యయమును చేర్చుట), “అభినయకత్తె" (సంస్కృత శబ్దముపై తెలుగు ప్రత్యయమును చేర్చుట) “సభికులు” (జూదరులు సభ్యులను నర్థమున ప్రయోగించుట) - వంటి వ్యాకరణ విరుద్ధ పదప్రయోగములు "నా యెఱుక” యందు ఎడనెడ కన్పట్టుచున్నవి. ఇట్టివానిని వారాదరించుటకు వారి అనభిజ్ఞత హేతువనుకొనుట విజ్ఞత కానేరదు.

“నా యెఱుక” సర్వతోముఖముగ ప్రశంసింపదగిన ప్రథమాంధ్ర స్వీయచరిత్ర. అపూర్వాంధ్రమహాపురుషులై అనేక రంగములందు అనుపమ స్థానమును ఆర్జించుకొన్న శ్రీ ఆదిభట్లవారి ఆత్మకథయగు నిది, అనతికాలములో ముద్రితమై ఆంధ్రుల గౌరవానురాగములను చూరగొనుచు, అనేక ప్రయోజనములను ప్రసాదించుగాక!

శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి స్వీయ చరిత్ర

'నా యెఱుక' యొక్క పీఠిక - 1976 ముద్రితము


సాహిత్య విమర్శ

469